భారత టెలికామ్ రంగంలో మరో విప్లవం రాబోతోందా?

Pre Booking For Elon Musks Starlink Satellite Internet Begins in India - Sakshi

స్టార్‌లింక్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రీబుకింగ్‌ ప్రారంభం

రుసుము 99 డాలర్లు 

శాటిలైట్‌ ద్వారా 2022 నుంచి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు చెందిన ఏరోస్పేస్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ సంస్థకు అనుబంధ సంస్థ స్టార్‌ లింక్‌... శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ సేవలను మన దేశంలో అందించేందుకు ప్రీబుకింగ్‌ ప్రారంభించింది. హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్‌నెట్‌ను ప్రపంచంలో ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని మారు మూల ప్రాంతాలకు అందించాలన్న లక్ష్యంతో, అలాగే ఇంటర్‌నెట్‌ ఇప్పటికే ఉన్న ప్రాంతాల్లో లో లేటెన్సీ (డేటా తన గమ్యస్థానాన్ని చేరుకునే వ్యవధి) కనెక్టివిటీ అందించాలన్న లక్ష్యంతో స్టార్‌లింక్‌.. శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనుంది. మన ఇంట్లో డీటీహెచ్‌ యాంటెన్నా కంటే చిన్న సైజులో ఉండే యాంటెన్నా ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి తేవాలన్నది దీని లక్ష్యం. 2015లోనే ఎలన్‌ మస్క్‌ దీనిపై సూత్రప్రాయ ప్రకటన చేశారు. స్పేస్‌ఎక్స్‌ కమ్యునికేషన్‌ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ద్వారా అందించనున్నట్టు ప్రకటించారు. దీనిని అభివృద్ధి పరిచేందుకు వాషింగ్టన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేశారు. 

ఇంటర్‌నెట్‌ సేవలు ఇలా..
భూమి నుంచి పంపే ఇంటర్‌నెట్‌ సిగ్నల్‌ను స్టార్‌లింక్‌ శాటిలైట్‌ రిసీవ్‌ చేసుకుంటుంది. ఈ శాటిలైట్‌ తన నెట్‌వర్క్‌లోని ఇతర శాటిలైట్లతో లేజర్‌ లైట్‌ సాయంతో కమ్యునికేట్‌ చేస్తుంది. లక్షిత శాటిలైట్‌ డేటా రిసీవ్‌ చేసుకోగానే.. కింద భూమిపై ఉన్న వినియోగదారుడి రిసీవర్‌కు రిలే చేస్తుంది. ఒక్కో శాటిలైట్‌ మొత్తం శాటిలైట్ల కూటమిలోని ఏవైనా నాలుగు శాటిలైట్లకు ఎల్లవేళలా అనుసంధానమై ఉంటుంది. యారే యాంటెన్నాలు శాటిలైట్లు డేటా బదిలీ చేసేందుకు సహకరిస్తాయి. వాటి నుంచి వినియోగదారులకు చిన్నసైజు డిష్‌ యాంటెన్నా ద్వారా ఇంటర్‌నెట్‌ సేవలను అందిస్తుంది. ఇప్పటికే నార్త్‌ అమెరికా తదితర ప్రాంతాల్లో బీటా(టెస్టింగ్‌) సేవలు అందిస్తోంది. ఎక్విప్‌మెంట్‌ కిట్‌ కోసం 499 డాలర్లు వసూలు చేస్తోంది.

ఇప్పటివరకు 150 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ సేవలు అందుతున్నాయని, భవిష్యత్తులో 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్‌నెట్‌ అందుతుందని సంస్థ చెబుతోంది. దేశంలో స్టార్‌లింక్‌ ఇంటర్‌నెట్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌ ప్రీబుకింగ్‌ ప్రారంభించింది. స్టార్‌లింక్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వినియోగదారులు తమ ప్రాంతంలో ఆ సేవల లభ్యతను తెలుసుకోవచ్చు. సేవల లభ్యత ఉంటే 99 డాలర్లు (సుమారు రూ.7 వేలు) చెల్లించి ప్రీబుకింగ్‌ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్‌ చేసుకున్న వారందరికీ సేవలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ముందుగా వచ్చిన వారికి ముందుగా సేవలు అన్న ప్రాతిపదికన అందించనుంది. అలాగే ఈ సేవలకు మన దేశ అధీకృత సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. అన్నీ సాఫీగా సాగితే 2022 నుంచి శాటిలైట్‌ ఆధారిత ఇంటర్‌నెట్‌ సేవలు లభిస్తాయి.

అంతరిక్షంలోకి 12 వేల శాటిలైట్లు
2019 మే 24న స్పేస్‌ఎక్స్‌.. స్టార్‌లింక్‌ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి  మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. భూమిపై 550 కి.మీ. ఎత్తులోలో ఎర్త్‌ ఆర్బిట్‌లో శాటిలైట్లను స్టార్‌లింక్‌ ఆపరేట్‌ చేస్తోంది. తక్కువ ఎత్తులో ఈ శాటిలైట్‌ ఉండడంతో లోలేటెన్సీ రేటు ఉంటుంది. ఒక్కో శాటిలైట్‌ 260 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉండేలా చాలా కాంపాక్ట్‌గా రూపొందించారు. ఈ శాటిలైట్‌కు నాలుగు యారే యాంటెన్నాలు ఉంటాయి. ఒక సింగిల్‌ సోలార్‌ యారే, అయాన్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్, నావిగేషన్‌ సెన్సార్లు, డెబ్రిస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ ఇందులో ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top