17 నుంచి డబ్ల్యూఈఎఫ్‌ వర్చువల్‌ సదస్సు

PM Narendra Modi to address WEF Davos virtual Summit - Sakshi

ఐదురోజుల సమావేశాల్లో తొలిరోజే ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ: వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) ఐదు రోజుల వర్చువల్‌ సమావేశం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజే ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్‌ వృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త దేశాల నాయకులు ప్రసంగించనున్నారు. సమావేశం డిజిటల్‌గా జరగడం ఇది వరుసగా రెండవసారి.

కోవిడ్‌–19, సాంకేతిక సహకారం, అంతర్జాతాయ సామాజిక సహకారం, వ్యాక్సిన్‌ విస్తృతి, ఇంధన బదలాయింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసాన్ని పాదుగొల్పడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్, భవిష్యత్‌ సవాళ్లకు సంసిద్ధత వంటి అంశాలు ఐదు రోజుల సమావేశ అజెండాలో ప్రధాన అంశాలు కానున్నాయి.  

భౌతిక సమావేశం వేసవికి వాయిదా...
 కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్‌ 2022 వార్షిక భౌతిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ ఇప్పటికే తెలిపింది. స్విట్జర్లాండ్‌ దావోస్‌లోని స్విస్‌ ఆల్పైన్‌ స్కీ రిసార్ట్‌ లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు స్వయంగా పాల్గొనాల్సి ఉంది. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములు అవుతారు.

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం 2020 జనవరిలో  దావోస్‌ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం  ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ–  వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్‌ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలతో 2022 భౌతిక సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top