ఖరీదైనా పెంచుకుంటున్నారు..

Pet Care Market Has Risen In India - Sakshi

రూ.8,000 కోట్లకు పెట్‌ కేర్‌ మార్కెట్‌

కోవిడ్‌తో మరింత జోరు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కుక్క, పిల్లి, పక్షి.. పెంపుడు జంతువు ఏదైనా వీటి మీద మనుషులకు ఉన్న ప్రేమ పెట్‌ కేర్‌ రంగ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. భారత్‌లో పెంపుడు జంతువుల సంరక్షణ (పెట్‌ కేర్‌) విపణి రూ.8,000 కోట్లుంది. ఇందులో సగం వాటా పెట్‌ ఫుడ్‌ కైవసం చేసుకుంది. మిగిలిన వాటా భద్రత, పోషణ, వ్యాయామం, వైద్య సంరక్షణ వంటి సేవలు దక్కించుకున్నాయి. కోవిడ్‌–19 మహమ్మారి పుణ్యమా అని ఒత్తిడి, నిరాశ నుంచి బయటపడేందుకు పెంపుడు జంతువులను పెంచుకునే ట్రెండ్‌ అధికం అయింది. ఈ నేపథ్యంలో 2025 నాటికి పరిశ్రమ రూ.10,000 కోట్లను దాటుతుందని అంచనా. దేశవ్యాప్తంగా 3 కోట్ల పైచిలుకు పెంపుడు జంతువులు ఉన్నట్టు సమాచారం. వీటి సంఖ్య ఏటా 11% పెరుగుతోంది. 

పోటీలో దిగ్గజాలు.. 
పెట్‌ ఫుడ్‌ విభాగం ఏటా 20 శాతం వృద్ధి చెందుతోందని ఎడెల్వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చెబుతోంది. పెట్‌ కేర్‌ రంగంలో మార్స్‌ పెట్‌కేర్, హిమాలయ వెల్‌నెస్‌ కంపెనీలు అగ్ర స్థానంలో ఉన్నాయి. ప్యూరినా పెట్‌కేర్‌ ఇండియాను కొనుగోలు చేయడం ద్వారా నెస్లే ఈ రంగంలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది. క్యానిస్‌ లుపస్‌ సర్వీసెస్‌ ఇండియాలో పెట్టుబడి చేస్తున్నట్టు ఇమామీ ప్రకటించింది. వేగంగా వృద్ధి చెందుతున్న పెట్‌ కేర్‌ మార్కెట్లలో భారత్‌ ఒకటిగా ఉందని మార్స్‌ పెట్‌కేర్‌ ఎండీ సలీల్‌ మూర్తి తెలిపారు. పెడిగ్రీ, విస్కాస్‌ వంటి బ్రాండ్లను ప్రమోట్‌ చేస్తున్న మార్స్‌ పెట్‌కేర్‌ హైదరాబాద్‌ ప్లాంటు విస్తరణకు రూ.500 కోట్ల పెట్టుబడి చేస్తోంది. కాస్మోస్‌ ఫిల్మ్స్‌ జిగ్లీ బ్రాండ్‌తో ఈ రంగంలో అడుగుపెట్టింది.  

లక్షలు వెచ్చిస్తున్నారు.. 
పెంపుడు జంతువుల కొనుగోళ్ల విషయంలో భారత్‌లో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ రెండవ స్థానంలో నిలిచింది. పెట్స్‌లో కుక్కల వాటా అత్యధికంగా 75 శాతం ఉంది. పిల్లులు 15 శాతం, పక్షులు 10 శాతం వాటా కైవసం చేసుకున్నాయని సమాచారం. షిడ్జూ కుక్క పిల్ల, ఆస్ట్రేలియన్‌ కాకటియెల్‌ పక్షులకు డిమాండ్‌ ఎక్కువ. రంగు రంగుల్లో లభించే పక్షుల అమ్మకాలే అధికం. బ్లూ–గోల్డ్‌ మకావ్‌ చిలుకలు రూ.2 లక్షల నుంచి, స్కార్లెట్‌ మకావ్‌ రూ.18 లక్షల వరకు లభిస్తాయి. ఒక మీటర్‌ దాకా పొడవు ఉండే హయసింత్‌ మకావ్‌ ఖరీదు రూ.40 లక్షల వరకు ఉంది.

సవన్నా పిల్లుల జతకు బెంగళూరులో ఓ కస్టమర్‌ రూ.50 లక్షలు, మరో కస్టమర్‌ కొరియన్‌ మాస్టిఫ్‌ కుక్కకు రూ.1 కోటి వెచ్చించారని అమ్మూస్‌ పెట్స్, కెన్నెల్స్‌ ఫౌండర్‌ మహమ్మద్‌ మొయినుద్దీన్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘విదేశాల నుంచి పెట్స్‌ దిగుమతిపై నిషేధం ఉంది. దేశీయంగానే వీటిని పెంచుతున్నారు. కోవిడ్‌ సమయంలో డిమాండ్‌ పెరగడంతో కొరత ఏర్పడి వీటి ధరలు రెండింతలయ్యాయి. రంగు, ఆకారం, ఆరోగ్య స్థితినిబట్టి ధర నిర్ణయం అవుతోంది’ అని తెలిపారు. సెలబ్రిటీల్లో క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్, సినీ నటుడు రామ్‌చరణ్, దర్శకుడు పూరీ జగన్నాథ్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే పెట్స్‌ ప్రేమికుల జాబితా పెద్దదే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top