
న్యూఢిల్లీ: ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతోంది. ఇందుకు నిదర్శనంగా ప్యాసివ్ ఫండ్స్ నిర్వహణలోని ఇన్వెస్టర్ల పెట్టుబడుల (ఏయూఎం) విలువ 2025 మార్చి నాటికి రూ.12.2 లక్షల కోట్లకు చేరింది. 2019 నాటికి ఉన్న రూ.1.91 లక్షల కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగింది.
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ మూడో ఎడిషన్ ‘ప్యాసివ్ సర్వే 2025’ ఈ వివరాలు విడుదల చేసింది. 2023 మార్చి నుంచి చూసినా ప్యాసివ్ ఫండ్స్ ఏయూఎం 1.7 రెట్లు పెరిగింది. మూడు వేల మందికి పైగా ఇన్వెస్టర్లు, ఫండ్స్ పంపిణీదారుల నుంచి అభిప్రాయాలను సర్వేలో భాగంగా మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తెలుసుకుంది.
ప్యాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్/ఈటీఎఫ్‌లు) అన్నవి నిర్దేశిత సూచీల్లోని స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. రాబడి కూడా సూచీల స్థాయిలోనే ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్ మెరుగైన రాబడుల అవకాశాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తూ, అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. యాక్టివ్ ఫండ్స్‌తో పోల్చి చూస్తే ప్యాసివ్ ఫండ్స్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది.
సర్వే అంశాలు..
76 శాతం మంది ఇన్వెస్టర్లు తమకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌ల పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పడం గమనార్హం.
68 శాతం ఇన్వెస్టర్లు కనీసం ఒక ప్యాసివ్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టారు. 2023లో ఇలాంటి వారు 61 శాతంగా ఉన్నారు.
ప్యాసివ్ ఫండ్స్‌కు ఆదరణ పెరిగినప్పటికీ.. యాక్టివ్ ఫండ్స్‌పైనా కొందరు ఇన్వెస్టర్లలో అమిత విశ్వాసం కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు యాక్టివ్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీరికి ప్యాసివ్ ఫండ్స్ గురించి పెద్దగా తెలియకపోవడం కూడా ఒక కారణం.
ప్యాసివ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి తక్కువ వ్యయాలు కారణమని 54 శాతం మంది చెప్పారు. సులభత్వం, పారదర్శక గురించి 46 శాతం మంది ప్రస్తావించారు. 29 శాతం మంది పనితీరును కారణంగా పేర్కొన్నారు.
మ్యూచువల్ ఫండ్స్ పంపిణీదారుల్లోనూ 93% మందికి ప్యాసివ్ ఫండ్స్‌పై అవగాహన ఉంది.
సర్వేలో పాల్గొన్న ఇన్వెస్టర్లలో 85 శాతం మంది మూడేళ్లకు పైగా పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. దీర్ఘకాలం కోసం పెట్టుబడుల ధోరణి వారిలో కనిపించింది. ఏడాది నుంచి మూడేళ్ల మధ్య పెట్టుబడులు కొనసాగిస్తున్న వారు 13 శాతంగా ఉన్నారు.
57 శాతం మంది ఇన్వెస్టర్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్), ఒకే విడతలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. 26 శాతం మంది కేవలం సిప్‌లో, 17 శాతం ఒకే విడత పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు 61 శాతం మంది చెప్పగా, రిటైర్మెంట్ నిధి కోసం 49 శాతం ఇన్వెస్ట్ చేస్తున్నారు.