
భారత్ - పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. గురువారం పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ గంటసేపు నిలిచిపోయింది. కరాచీ, లాహోర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో భయాందోళనలు చెలరేగాయి. దీంతో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కేఎస్ఈ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయి.. వరుసగా రెండవ సెషన్‌లో కూడా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, కేఎస్ఈ 100 13 శాతం క్షీణించగా, కేఎస్ఈ 30 ఇప్పటివరకు 14.3 శాతం పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాక్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ముగిసింది. ఈ రోజు కూడా భారీ నష్టాలనే చవిచూడాల్సి వచ్చింది.