రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చాలా సంవత్సరాలుగా ఆర్ధిక పరమైన అంశాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు 2026లో సురక్షితమైన ఆస్తుల గురించి వివరించారు.
కియోసాకి ప్రకారం.. అమెరికా డాలర్ వంటి ప్రభుత్వ డబ్బు “నిజమైన సంపద కాదు”, ఎందుకంటే ప్రభుత్వం అవసరమైతే ఎక్కువ డబ్బు ముద్రించగలదు. ఇలా డబ్బు ముద్రించడం వల్ల దాని విలువ తగ్గిపోతుందని ఆయన అంటున్నారు. అందుకే ఆయన దీనిని “ఫేక్ మనీ” అని అంటారు.
ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం చాలా ఎక్కువగా ఉందని, రోజుకి బిలియన్ల డాలర్ల రుణం పెరుగుతుందని.. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తులో ప్రమాదంలో పడవచ్చని కియోసాకి అభిప్రాయం.
కియోసాకి చెప్పిన సురక్షితమైన ఆస్తులు
బంగారం (Gold)
వెండి (Silver)
చమురు (Oil)
ఆహారం (Food)
బిట్‌కాయిన్ (Bitcoin)
ఈథీరియం (Ethereum)
కియోసాకి అభిప్రాయం ప్రకారం.. పరిమితంగా ఉండే వనరులు విలువైనవి. ఎందుకంటే వాటిని అంత సులభంగా తయారు చేయలేము. కాబట్టి వీటి విలువ క్రమంగా పెరుగుతుందని విశ్వసిస్తారు.
బంగారం, వెండి
బంగారం ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ప్రపంచంలో ఆర్ధిక అనిశ్చితి పెరిగినప్పుడు వీటి విలువ పెరుగుతుంది. కాబట్టి దీనిపై పెట్టె పెట్టుబడులు ప్రజలను ధనవంతులను చేస్తుంది. లేదా కష్టకాలంలో ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పిస్తుంది.
క్రిప్టో కరెన్సీ
కియోసాకి బిట్‌కాయిన్, ఈథీరియంను భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా చూస్తున్నారు. ఇవి కూడా ప్రభుత్వ నియంత్రణలో లేవు కాబట్టి సంప్రదాయ డబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని ఆయన భావిస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇందులో పెట్టుబడి పెట్టడం అంటే కొంత రిస్క్ కూడా ఎదుర్కోవాలి ఉంటుంది.
చమురు, ఆహారం
చమురు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మౌలిక అవసరం. యుద్ధాలు లేదా సరఫరా సమస్యలు దెబ్బతింటే ధరలు పెరుగుతాయి. అదే విధంగా ఆహార ధరలు కూడా ఇంధన ధరలపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవి కూడా 'అవసరమైన ఆస్తులు' అని కియోసాకి అభిప్రాయం.
కియోసాకి చెప్పిన ఈ మాటలతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు విమర్శించారు. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి అంచనా నిజం కాలేదు కాబట్టి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ఆర్ధిక నిపుణులు ఒకే రకమైన పెట్టుబడులపై పూర్తిగా ఆధారపడకూడదని సూచిస్తారు.
ఇదీ చదవండి: ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!


