దుమ్ము లేపుతున్న ఆన్‌లైన్‌ అమ్మకాలు, పండగ సీజన్‌లో ఏకంగా రూ. 94 వేల కోట్లు బిజినెస్‌

Online Sales During Festive Months To Reach 11.8 Billion Redseer Report - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ–కామర్స్‌ కంపెనీల జోరు కొనసాగుతోంది. దీపావళితో ముగిసే నెల రోజుల పండుగల సీజన్లో ఆన్‌లైన్‌ వేదికగా రూ.94 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని రెడ్‌సీర్‌ అంచనా వేస్తోంది. 

గతేడాది సీజన్‌తో పోలిస్తే ఇది 28 శాతం అధికమని వెల్లడించింది. పెరిగిన వినియోగదార్ల సంఖ్యకు అనుగుణంగా అమ్మకాలు అధికంగా ఉంటాయని రెడ్‌సీర్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ సంజయ్‌ కొఠారీ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ పండుగల సీజన్లో ఆన్‌లైన్‌ షాపర్స్‌ రెండింతలు కానున్నారని వివరించారు. ఫెస్టివ్‌ సేల్స్‌ పట్ల అవగాహన, విస్తృతి పెరగడం, కస్టమర్ల లక్ష్యంగా ఎంపికలు, ఉత్పత్తుల శ్రేణి విరివిగా అందుబాటు ధరలో ఉండడం ఇందుకు కారణమన్నారు. 2021లో ఆన్‌లైన్‌ సేల్స్‌ రూ.4,14,232 కోట్లు నమోదైంది. ప్రస్తుత సంవత్సరం ఇది 30 శాతం అధికమై రూ.5,41,688 కోట్లకు చేరనుందని రెడ్‌సీర్‌ అంచనా వేస్తోంది.  
|
నాలుగింతల వృద్ధి.. 
ఆన్‌లైన్‌ కస్టమర్ల సంఖ్య 2018తో పోలిస్తే ఈ ఏడాది నాలుగింతల వృద్ధి నమోదు కానుందని రెడ్‌సీర్‌ తెలిపింది. ‘డిజిటల్‌ వైపు కస్టమర్లు బాట పట్టడం, ద్వితీయ శ్రేణి నగరాల్లో వినియోగదార్ల సంఖ్య పెరగడం ఈ స్థాయి వృద్ధికి దోహదం చేయనుంది. సీజన్‌ తొలి వారం రూ.47 వేల కోట్ల వ్యాపారం జరిగే చాన్స్‌ ఉంది. ఫ్యాషన్‌ విభాగం గణనీయంగా దూసుకెళ్లనుంది.

ద్వితీయ శ్రేణి నగరాల నుంచి కస్టమర్లు పెరగడమే ఇందుకు కారణం. అలాగే తొలిసారిగా ఆన్‌లైన్‌కు మళ్లినవారు ఫ్యాషన్‌ను ఎంచుకుంటారు. ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఎక్కువ మొత్తంలో రంగ ప్రవేశం చేయనున్నాయి. మెరుగైన డీల్స్, నూతన ఆవిష్కరణల కారణంగా మొబైల్, ఎలక్ట్రానిక్స్‌ విభాగం బలమైన పనితీరు కనబర్చనుంది. లైవ్, వీడియో కామర్స్‌తో ఆన్‌లైన్‌ షాపర్స్‌ సంఖ్య మరింత పెరుగుతుంది’ అని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top