
ఈ–స్పోర్ట్స్, డిజిటల్ సోషల్ గేమ్స్‌ను ప్రోత్సహించేందుకు, రియల్ మనీ గేమ్స్ (ఆర్‌ఎంజీ)పై నిషేధం అమలుకు ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను (ఓజీఏఐ) ఏర్పాటు చేసేలా కేంద్రం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనికి ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సారథ్యం వహిస్తుంది. సమాచార–ప్రసార శాఖ, యూత్ అఫైర్స్ తదితర శాఖల సమన్వయంతో ఇది పనిచేస్తుంది.
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ (పీఆర్‌వోజీ) చట్టం 2025 కింద కేంద్రం ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ఆవిష్కరించింది. వీటిపై అక్టోబర్ 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముసాయిదా ప్రకారం ఓజీఏఐకి మెయిటీలోని అదనపు కార్యదర్శి స్థాయి అధికారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఇది దేశీయంగా చట్టబద్ధంగా ఆడతగిన ఈ–స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్స్‌ను ఆమోదిస్తుంది.
అలాగే పీఆర్‌వోజీ చట్టాన్ని ఉల్లంఘించే గేమ్స్, స్పోర్ట్స్‌ను రద్దు కూడా చేయగలదు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ సర్వీసులు ఆఫర్ చేసే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై ప్రకటనలు ఇస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?