ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఎండీగా కె.వి. ప్రదీప్‌

Olectra Greentech Limited board appoints K V Pradeep as Managing Director - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) గ్రూప్‌ కంపెనీ అయిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్‌ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్‌ ఇంజనీర్‌ అయిన ప్రదీప్‌.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్‌ బస్‌ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్‌లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు.  

ఆర్డర్‌ బుక్‌ 1,325 బస్‌లు..
ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్‌లకు ఆర్డర్‌ ఉంది. ఇందులో              87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్‌ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్‌ బిడ్డర్‌గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్‌ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్‌ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్‌ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్‌ పంపిణీకి అవసరమైన సిలికాన్‌ రబ్బర్‌/కంపోజిట్‌ ఇన్సులేటర్స్‌ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ దేశంలో అతిపెద్ద కంపెనీ.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top