
జూలైలో ఈవీ ప్యాసింజర్ విక్రయాలు 93% వృద్ధి
ముంబై: ఎలక్ట్రిక్ వాహన ప్యాసింజర్ విక్రయాలు జూలైలో 93% వృద్ధిని సాధించినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) గణాంకాలు తెలిపాయి. సమీక్షించిన నెలలో 15,528 ఈవీ కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయాలు 8,037 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో ఏకంగా 6,047 ఈవీ కార్లను విక్రయించి టాటా మోటార్స్ ఆధిపత్యం కొనసాగించింది. గతేడాది కంపెనీ జూలైలో 5,100 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అయితే ఈవీ టూవీలర్స్ విక్రయాల్లో 4% క్షీణత నమోదైంది. గతేడాది జూలైలో 1,07,655 యూనిట్లు అమ్మకాలు జరగ్గా ఈ జూలైలో 1,02,973 యూనిట్లకు పరిమితయ్యాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 22,256 యూనిట్ల రిజి్రస్టేషన్లతో అగ్రస్థానంలో ఉంది.
ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ 63,675 యూనిట్ల నుంచి 9% పెరిగి 69,146 యూనిట్లకు చేరాయి. ఈ విభాగంలో 9,766 యూనిట్ల విక్రయాలతో మహీంద్రా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. గతేడాది కంటే మహీంద్రా 40 శాతం ఎక్కువ అమ్మకాలను సాధించింది. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహన రిటైల్ అమ్మకాలు జూలైలో 52 శాతం పెరిగి 1,244 యూనిట్లకు చేరాయి. ఈ సెగ్మెంట్‌లోనూ టాటా మోటార్స్ 333 యూనిట్లతో ముందుంది. ‘‘భారత్ ఆటో పరిశ్రమలో ఈవీ పరివర్తన వేగంగా కదులుతుందనేందుకు గణాంకాలు నిదర్శనం. ప్రభుత్వం నుంచి లభిస్తున్న మద్దతు, ఫైనాన్స్, చార్జింగ్ మౌలిక సదుపాయాల కారణంగా అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు.