
స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎంత ఉంటుందో లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కొన్ని స్టాక్స్ ఇన్వెస్టర్లను దివాళా తీయిస్తే మరికొన్ని మాత్రం కోటీశ్వరులను చేస్తాయి. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ గత దశాబ్దంలో దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు భారీ రాబడిని తెచ్చిపెట్టింది.
ఆ కంపెనీ షేర్లు 11,419% పెరిగాయి. 2015లో రూ .14 ఉన్న షేరు ధర 2025 సెప్టెంబర్ 10 నాటికి రూ .1,612.60 కు పెరిగింది. అంటే ఎంతలా పెరిగిందంటే రూ .1 లక్ష పెట్టుబడి పెట్టారనుకుంటే ఇప్పుడది రూ .1 కోటి కంటే ఎక్కువగా పెరిగిందన్న మాట. ఆ స్టాక్ ఏదో కాదు.. ఎంఈఐఎల్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్‌ది. 2025 జూన్ 30 నాటికి ఈ కంపెనీలో ఎంఈఐఎల్ హోల్డింగ్స్ 50% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉందని తాజా షేర్ హోల్డింగ్ డేటా తెలిజేస్తోంది.
ఒలెక్ట్రా గురించి..
గతంలో గోల్డ్ స్టోన్ ఇన్ ఫ్రాటెక్ అనే పేరుతో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్ టెక్ దేశంలో తొలి ఎలక్ట్రిక్ బస్ తయారుదారు. ఈ సంస్థ 2000లో స్థాపితమైంది. ఇది ఎలక్ట్రిక్ బస్సులు, ఇన్సులేటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ తయారు చేసిన ఎలక్ట్రిక్ బస్సులు దేశంలోని దాదాపు అన్ని మెట్రో, టైర్2, టైర్3 నగరాల్లో తిరుతున్నాయి. దేశ ఎలక్ట్రిక్ బస్ రంగంలో 25 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీదే.
2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్థూల విక్రయాలు రూ.1801.90 కోట్లుగా నమోదయ్యాయి. పన్నులు పోనూ రూ.139.21 కోట్ల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 161 బస్సులు డెలివరీ చేసింది. ఎలక్ట్రిక్ బస్ ఆర్డర్ బుక్ 10,193 యూనిట్లుగా ఉంది. 5,000 బస్సుల ప్రారంభ సామర్థ్యంతో (10,000 వరకు స్కేలబుల్) రాబోయే తయారీ కేంద్రం 2026 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
(గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. ఇన్వెస్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది.)