రష్యా నుంచి భారీగా చమురు దిగుమతులు: కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడి

Oil supply to india at a low rate to russia - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి చమురు దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. 2022 ఏప్రిల్‌ నుంచి 2023 ఫిబ్రవరి వరకు 11 నెలల్లో ఐదు రెట్లు పెరిగి 41.56 బిలియన్‌ డాలర్లకు (రూ.3.40 లక్షల కోట్లు) చేరినట్టు వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2021 - 2022 ఆర్థిక సంవత్సరంలో మన దేశ చమురు దిగుమతుల్లో రష్యా 18వ స్థానంలో ఉంది. ఆ ఏడాది 9.86 బిలియన్‌ డాలర్ల చమురు దిగుమతులు నమోదయ్యాయి. ఇప్పుడు చమురు దిగుమతుల్లో నాలుగో పెద్ద దేశంగా రష్యా నిలిచింది. జనవరిలో మన చమురు దిగుమతుల్లో 28 శాతం రష్యా నుంచే వచి్చంది. 

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు మన చమురు దిగుమతుల్లో 1 శాతం వాటానే కలిగిన రష్యా.. 2023 జనవరిలో 1.27 మిలియన్‌ బ్యారెళ్లతో (రోజువారీ) 28 శాతం వాటాను సొంతం చేసుకుంది. ప్రపంచంలో చైనా, అమెరికా తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ దిగుమతులు తగ్గించుకున్నాయి. దీంతో మార్కెట్‌ రేటు కంటే తక్కువకే రష్యా భారత్‌కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. దీంతో రష్యా నుంచి మన దేశం పెద్ద ఎత్తున చమురు దిగుమతికి మొగ్గు చూపించింది.

చైనా నుంచి పెరిగిన దిగుమతులు

  • చైనా నుంచి దిగుమతులు 6.2 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - ఫిబ్రవరి మధ్య 90.72 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 
  • యూఏఈ నుంచి దిగుమతులు 21.5 శాతం పెరిగి 49 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.  
  • అమెరికా నుంచి 19.5 శాతం అధికంగా 46 బిలియన్‌ డాలర్ల దిగుమతులు నమోదయ్యాయి.  
  • ఎగుమతుల పరంగా చూస్తే అమెరికా 17.5% తో భారత్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. అమెరికాకు మన దేశం నుంచి ఈ 11 నెల ల్లో 71 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి.  
  • యూఏఈకి సైతం ఎగుమతులు 28.63 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి.  
  • చైనాకి మన దేశ ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 19.81 బిలియన్‌ డాలర్ల ఉంచి 13.64 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top