చమురు సింహద్వారం | Kharg Island is central to Iran oil exports | Sakshi
Sakshi News home page

చమురు సింహద్వారం

Mar 15 2026 2:11 AM | Updated on Mar 15 2026 2:11 AM

Kharg Island is central to Iran oil exports

ఇరాన్‌ 90 శాతం ముడిచమురు ఎగుమతులకు కేంద్రస్థానంగా ఖర్గ్‌ ఐలాండ్‌

దేశ ఆర్థిక కేంద్రబిందువుగా భాసిల్లుతున్న భారీ చమురు టర్మినల్‌

ఖర్గ్‌ ఐలాండ్‌. ఇరాన్‌ ప్రధాన భూభాగానికి దక్షిణంగా 25 కిలోమీటర్ల దూరంలో పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రజలాల్లో ఉన్న అతిచిన్న దీవి ఇది. ఇరాన్‌ ముడిచమురుకు సంబంధించి ఈ దీవి దశాబ్దాలుగా అంతర్జాతీయ ఎగుమతుల రాజధానిగా భాసిల్లుతోంది. దేశ ఎగుమతుల్లో ఇక్కడి నుంచే 90 శాతం జరుగుతున్నాయి. ఇరాన్‌ ఆర్థికజీవనాడిగా వినతికెక్కిన ఖర్గ్‌ ద్వీపంపై అమెరికా శనివారం దాడి చేయడంతో ఈ దీవి భద్రతపై ఒక్కసారిగా నీలినీడలు కమ్ముకున్నాయి. దీవిని కాపాడుకునేందుకు ఇరాన్‌ శతథా ప్రయత్నించడం ఖాయం. ఇరాన్‌లో ఈ ద్వీపాన్ని కిరీటంలో రత్నంగా పిలుస్తారు. ఇరాన్‌ చమురు కిరీటంగానూ ఘనకీర్తిని సాధించిన ఖర్గ్‌ దీవిని నాశనం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా కంకణం కట్టుకున్నాయి. ఈ పోరులో గెలుపెవరిదో వెనువెంటనే చెప్పడం కష్టమని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. 

భారీ భద్రత.. అంతకంటే పెద్ద పైప్‌లైన్లు.. 
ఇరాన్‌లోని అతిపెద్ద ముడిచమురు, సహజవాయు క్షేత్రాలు అన్నింటి నుంచీ ఈ దీవికి పైప్‌లైన్‌ వ్యవస్థ ఉంది. అబూజార్, ఫొరైజాన్, దారూద్, అవాజ్, మరూన్, గచ్చరన్‌ చమురు క్షేత్రాల నుంచి భారీ పైప్‌లైన్లు ఏర్పాటుచేసి క్రూడ్‌ ఆయిల్, గ్యాస్‌ను దీవికి సరఫరా చేస్తుంటారు. ఇక్కడ చమురు డిపోల్లో నిల్వచేసి అంతర్జాతీయ డిమాండ్‌కు తగ్గట్లుగా నౌకల్లో విదేశాలకు సరఫరా చేస్తుంటారు. ఈ దీవి విస్తీర్ణం కేవలం 20 చదరపు కిలోమీటర్లు. సమీప సముద్రజలాల వెంట ఒడ్డు లోతు చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో భారీ చమురు రవాణా నౌకలు సైతం సులభంగా తీరందాకా వచ్చి సరుకును ఎక్కించుకునే అవకాశం ఉంది.

దీంతో రోజుకు 70 లక్షల బ్యారెళ్ల ముడిచమురును లోడింగ్‌ చేసే సామర్థ్యంతో ఇక్కడి నౌకాశ్రయాన్ని ఆధునీకరించారు. ఇక్కడి చమురు డిపోల్లో ఏకంగా 3 కోట్ల బ్యారెళ్ల చమురును నిల్వచేసే అవకాశం ఉంది. ఇరాన్‌ రోజూ 4.5 శాతం ప్రపంచ చమురు అవసరాలను తీరుస్తోంది. రోజూ 33 లక్షల బ్యారెళ్ల ముడి చమురును, 13 లక్షల బ్యారెళ్ల తక్కువ గాఢత ఉన్న ద్రవరూప హైడ్రోకార్బన్‌ మిశ్రమాన్ని ఎగుమతిచేస్తోంది. ఆర్థికంగా అత్యంత కీలకమైన ప్రదేశం కావడంతో ఇక్కడ సైనిక మోహరింపు అనూహ్యస్థాయిలో ఉంటుంది.

ముందస్తు అనుమతి లేకుండా ఎంత పెద్ద అధికారి అయినా దీవిలోకి అడుగుపెట్టడం అసాధ్యం. యుద్ధం మొదలయ్యాక ఈ దీవి నుంచి ఎగుమతులు చరిత్రలో ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి పెరిగాయని అమెరికా పెట్టుబడుల బ్యాంక్‌ ‘జేపీ మోర్గాన్‌’ఇటీవల పేర్కొంది. రెండేళ్ల క్రితమే ఇరాన్‌ కేవలం ముడిచమురు అమ్మకాలతో 80 బిలియన్‌ డాలర్ల లాభాలు గడించింది.  

1960 దశకం నుంచే అభివృద్ధి 
ఈ దీవిలో క్రీస్తుపూర్వం 550 నుంచి 330 కాలంలో ఇక్కడ ప్రాచీననాగరికత వెల్లివిరిసిందని పురాతత్వశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అచమెనిడ్‌ సామ్రాజ్య కాలం నాటి శాసనాలు, సమాధులు ఇక్కడ లభించాయి. సుమేరియన్ల కాలంనాటి క్యూనిఫామ్‌ సంజ్ఞల రూప రాతలూ ఇక్కడ వెలుగుచూశాయి. శతాబ్దాల క్రితం ఇక్కడి నుంచి వ్యాపారాలు జరిగేవి. ఇక్కడి ముత్యాలు అత్యంత నాణ్యమైనవని 982 సంవత్సరంలో రచించిన ‘హుదుద్‌ అల్‌ ఆలమ్‌’రచనలో పేర్కొన్నారు. 18వ శతాబ్దంలో డచ్‌ వలసపాలనలో ఈ దీవి భాగంగా ఉండేది. శతాబ్దాల క్రితమే ఇక్కడ చర్చిలు నిర్మించారు. 1830వ దశకంలో ఈ దీవిని కొంతకాలం బ్రిటన్‌ తన అ«దీనంలో ఉంచుకుంది. తర్వాత రెజా షా పహ్లావీ రాజరికపాలనలో దీవి అభివృద్ధి నెమ్మదిగా మొదలైంది.

భారీ నౌకలు సైతం లంగరువేసేందుకు అనువుగా ఉండటం, హార్మూజ్‌ జలసంధికి సైతం సమీపంగా ఉండటంతో ఈ దీవి సరుకు రవాణాకు అత్యంత ఉత్తమమని ఇరాన్‌ పాలకులు భావించారు. దీంతో నాటి షా పాలకుల కాలంలో అమెరికాకు చెందిన ఆమోకో కంపెనీ సహకారంతో 1960 దశకంలోనే దీవిలో ఆయిల్‌ టరి్మనల్‌ను తొలిసారిగా నిర్మించారు. తర్వాత అత్యంత వేగంగా దీవి కీలకమైన చమురు టర్మినల్‌గా విస్తరించింది.

ఇక్కడ చిన్న విమానాశ్రయం సైతం ఉంది. దీవిని దిగ్బంధించి ఇరాన్‌తో బేరసారాలు మొదలెట్టాలని అమెరికా ఆశపడుతోంది. హార్మూజ్‌ జలసంధి గుండా రాకపోకలకు ఇరాన్‌ అనుమతించేలా ఆ దేశంపై ఒత్తిడిచేయాలని అమెరికా చూస్తోంది. ఒప్పుకోకుంటే దీవిలో ఒక్క చమురుచుక్క మిగలకుండా తగలబెడతామని ఇటీవలే వైట్‌హౌస్‌ సమావేశంలో ట్రంప్‌ తెగేసిచెప్పడంతో ఇప్పుడీ దీవి పరిస్థితి ఏంటనే చర్చ కొనసాగుతోంది.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement