జీతాలక్కూడా డబ్బుల్లేవు: 5 స్టార్ హోటల్ మూత

No money to pay salaries, Hyatt Regency Mumbai tells staff as it suspends operations - Sakshi

కరోనా, లాక్‌డౌన్‌తో కుదేలైన హోటల్‌ రంగం

సెకండ్‌వేవ్‌ మరింత సంక్షోభం

సిబ్బందికి జీతాలు  చెల్లించలేం, కార్యకలాపాలు  తాత్కాలికంగా రద్దు: హయత్ రీజెన్సీ

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం అంతా ఇంతాకాదు. లాక్‌డౌన్‌ సంబంధిత ఆంక్షలతో రవాణా, పర్యాటక రంగం నష్టాల్లో కూరుకుపోయాయి. కాస్త పుంజుకుంటున్నతరుణంలో మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలోమరోసారి పంజా విసిరింది. ఈ నేపథ్యంలోముంబైకి లగ్జరీ 5 స్టార్ హోటల్ హయత్ రీజెన్సీ మూసివేత  ప్రకటన  సంచలనంగా మారింది. సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు కూడా తమ దగ్గర  నిధులు లేవని చేతులెత్తేసింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. నిధుల కొరత కారణంగా హోటల్‌ కార్యకలాపాలను నిర్వహించలేని స్తితిలో ఉన్నామంటూ ఉద్యోగులను నోటీసులిచ్చింది.  

తన యజమాన్య సంస్థ ఆసియన్ హోటల్స్ (వెస్ట్) నుండి నిధులు రావడంలేదనీ, అందుకే జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని, చివరకు హోటల్ కార్యకలాపాలను కూడా నిర్వహించలేని స్థితిలో ఉన్నామని హయత్‌ రీజెన్సీ వెల్లడించింది. దీంతో హయత్ బుకింగ్ ఛానెళ్ల ద్వారా భవిష్యత్తులో రిజర్వేషన్లు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తదుపరి నోటీసులవరకు హోటల్ మూసి ఉంటుదని హయత్  రీజెన్సీ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ సున్జే శర్మ ఒక ప్రకటనలో తెలిపారు  ఈ  సమయంలో భవిష్యత్ బుకింగ్‌లన్నీ గ్రాండ్ హయత్‌కు మళ్లిస్తున్నట్టు చెప్పారు.  అయితే, హోటల్‌లో సిబ్బంది భవిష్యత్తుపై స్పష్టతనివ్వలేదు.

కాగా జనవరి 8, 2007 న ఆసియా హోటల్స్ వెస్ట్  చిల్‌విండ్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా విలీనమైంది. ఫిబ్రవరి 11, 2010 నుండి అమల్లోకి వచ్చిన ఆసియా హోటల్స్ లిమిటెడ్ (ప్రస్తుత ఆసియా హోటల్స్ (నార్త్) లిమిటెడ్)తో స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అండ్ డీమెర్జర్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఆసియా హోటల్స్ వెస్ట్ రెండు ఆస్తులను నడుపుతోంది .హయత్ రీజెన్సీ ముంబై , జెడబ్ల్యూ మారియట్ హోటల్ న్యూఢిల్లీ. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో(క్యూ3) ఆసియా హోటల్స్ రూ .11 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలో రూ .31.9 కోట్లు నష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు స్టాక్ ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారం ప్రకారం ఎస్‌బ్యాంకునకు 4.32 కోట్ల రూపాయల రుణం డిఫాల్ట్  అయింది. మొత్తంగా, మే 1, 2021 నాటికి 262.54 కోట్ల రూపాయలు మేర అప్పులున్నాయి. 2020  నాటి సంక్షోభంలో గ్లోబల్‌గా 1300మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top