సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ, విజయం సాధించడానికి ఖరీదైన లేదా పెద్ద కోచింగ్ సెంటర్లే అవసరం లేదని నిరూపించారు హర్యానాకు చెందిన 23 ఏళ్ల ఛవి సర్దానా (Chhavi Sardana). సొంతంగా చదువుకుంటూ.. రోజుకు సుమారు 8 గంటలు పరీక్షల కోసం కష్టపడి చదివిన ఆమె.. హర్యానా సివిల్ సర్వీసెస్ (HCS) పరీక్షలు 2025లో ఐదో ర్యాంక్ సాధించారు. మొత్తం 675 మార్కులకు గాను 385.80 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
హర్యానాలోని హిసార్ పట్టణానికి చెందిన ఛవి.. చిన్నప్పటి నుంచి తన కెరీర్‌పై స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగారు. పాటియాలాలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన ఆమెకు మొదట న్యాయవాదిగా స్థిరపడాలని ఉండేది. అయితే.. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఎదగాలనే కోరిక కూడా బలంగా ఉండటంతో, కాలేజీలో చదువుకుంటున్నప్పుడే పోటీ పరీక్షలకు సిద్ధమవడం ప్రారంభించారు.
రోజుకు 8 గంటలు చదువు
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే.. కోచింగ్ తప్పనిసరి అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఛవి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ చేరకుండా సొంతంగానే చదువుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య చదవడం ప్రారంభించి, దాదాపు 8 గంటల పాటు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించేవారు.
కాలేజీ చదువులు పూర్తి చేయడంతో పాటు, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవడం అంత సులభం కాదు. అయినప్పటికీ.. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ, తన లక్ష్యంపై దృష్టి పెట్టారు. రోజూ కొంత సమయం చదవడం, నేర్చుకున్న అంశాలను అర్థం చేసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవడంపై దృష్టి సారించారు. ఇలా క్రమం తప్పకుండా చేసిన ప్రయత్నమే చివరకు ఆమెకు మంచి ఫలితాన్ని అందించింది.
చాట్‌జీపీటీ సాయం
పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో.. చాలామందికి సోషల్ మీడియా పెద్ద ఆటంకంగా మారుతుంది. గంటల తరబడి ఫోన్‌లో గడపడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తించిన ఛవి, తన ప్రిపరేషన్ సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలకు దూరంగా ఉన్నారు.
అదే సమయంలో.. చదువుకునే సమయంలో వచ్చిన సందేహాలను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాట్‌జీపీటీ(ChatGPT)ను ఉపయోగించుకున్నారు. వివిధ అంశాల గురించి సమాచారం తెలుసుకోవడం, కష్టంగా అనిపించే విషయాలను సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఈ టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నారు.
60వేల మందితో పోటీ
హర్యానా సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ ప్రారంభ దశలో సుమారు 60 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు ఛవి తెలిపారు. వివిధ దశలను దాటుకుంటూ చివరకు ఇంటర్వ్యూ వరకు చేరుకోవడం అభ్యర్థులకు పెద్ద సవాలే. ఈ పరీక్షల మొదటి దశ ఏప్రిల్‌లో, రెండో దశ జూన్‌లో నిర్వహించారు. అనంతరం అక్టోబర్ 3 నుంచి 8 వరకు పంచకులాలోని కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ప్రక్రియలో అన్ని దశలను పూర్తి చేసిన ఛవి.. తుది ఫలితాల్లో ఐదో ర్యాంక్ సాధించారు.
హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన ఛవి ప్రయాణం ఇక్కడితో ముగియలేదు. ఆమె ఇప్పటికే పంజాబ్ సివిల్ సర్వీసెస్ (PCS), యూపీఎస్‌సీ పరీక్షలకు కూడా హాజరయ్యారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. అయితే, హర్యానాలో సాధించిన ఉద్యోగ బాధ్యతలకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆమె తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారంతో.. చైనా మాస్టర్ ప్లాన్!


