
నగదు రహిత పాలసీపై బీమా కంపెనీలు, ఆస్పత్రుల మధ్య వివాదం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా ఆసుపత్రులు రెండు బీమా కంపెనీల క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ సదుపాయాన్ని సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో బజాజ్ అలియాంజ్, కేర్ హెల్త్ ఉన్నాయి.
ఆస్పత్రుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. చికిత్స వ్యయం నిరంతరం పెరుగుతోందని, కానీ సంబంధిత బీమా కంపెనీలు చికిత్స ఖర్చుల రేట్లు (పరిమితులు) మాత్రం పెంచడం లేదని, ఏహెచ్‌పీఐ చెబుతోంది.
అంతే కాకుండా ఆయా కంపెనీలు చెల్లింపుల్లో జాప్యం చేస్తూ అనవసరమైన పత్రాలు అడుగుతున్నాయని ఆస్పత్రుల వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పాలసీ సంబంధిత చెల్లింపుల్లో అనేక సమస్యలు తలెత్తడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏహెచ్పీఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 15 వేల ఆసుపత్రులు నగదు రహిత చికిత్స అందించేందుకు నిరాకరించాయి. మరోవైపు రోగుల నగదు రహిత బిల్లు చెల్లింపునకు సంబంధించిన సమస్యలపై చర్చించాలని కేర్ హెల్త్ కు ఏహెచ్ పీఐ నోటీసులు జారీ చేసింది. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి నగదు రహిత వైద్యం పూర్తిగా నిలిచిపోతుంది.
వివాదానికి ప్రధాన కారణం
బజాజ్ అలియాంజ్ పాత కాంట్రాక్ట్ రేట్లను పెంచడానికి నిరాకరించిందని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం, చికిత్స ఖర్చుల రేట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కానీ కంపెనీ దీనికి సిద్ధంగా లేదు. దీనికి భిన్నంగా ఎలాంటి కారణం చెప్పకుండా రోగిని అడ్మిట్ చేసుకున్నప్పుడు మందులు, పరీక్షలు, హాస్పిటల్ రూమ్ ఛార్జీలను తగ్గించడం ప్రారంభించింది.
అంతేకాకుండా రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత తుది బిల్లును ఆమోదించే సమయాన్ని కూడా పెంచడంతో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోంది. అయితే ఈ ఆరోపణలపై రెండు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సేవలు నిలిచిపోతే ఈ సంస్థల నుండి ఆరోగ్య బీమా తీసుకున్న రోగులు ఆసుపత్రి బిల్లును స్వయంగా తమ జేబుల నుంచి
చెల్లించి ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రెండు కంపెనీలు ఎలాంటి కారణం లేకుండా చికిత్స ఖర్చులకు సంబంధించిన బిల్లులను తగ్గిస్తున్నాయని ఏహెచ్‌పీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ గ్యానీ తెలిపారు. రోగిని డిశ్చార్జ్ చేసిన ఆరు నుంచి ఏడు గంటల తర్వాత బిల్లు ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. చర్చల కోసం ఇరు బీమా కంపెనీలకు తమ వైపు నుంచి ఈమెయిల్ పంపామని, అంశంపై బుధవారం కేర్ హెల్త్, గురువారం బజాజ్ అలియాంజ్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. పరిష్కారం లభించకపోతే నగదు రహిత సదుపాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు.