నెమ్మదించిన అంకురాలు.. బిలియన్‌ డాలర్లు దాటిన స్టార్టప్‌లు ఎన్నంటే..

New unicorns dropped in 2023 - Sakshi

2023లో తగ్గిన కొత్త యూనికార్న్‌లు

ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ నివేదికలో వెల్లడి

ముంబై: దేశీయంగా స్టార్టప్‌ వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తూ 2023లో కొత్త యూనికార్న్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2022లో మొత్తం 24 అంకుర సంస్థలు ఒక బిలియన్‌ డాలర్లకు పైగా వేల్యుయేషన్‌ అందుకోగా ఈసారి కొత్తగా మూడు మాత్రమే ఆ హోదా దక్కించుకున్నాయి. మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 84 నుంచి 83కి తగ్గింది. ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ హురున్‌ ఇండియన్‌ ఫ్యూచర్‌ యూనికార్న్‌ సూచీ 2023 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఇన్వెస్టర్లలో పెట్టుబడులపై ఆసక్తి మందగించడంతో అంకుర సంస్థలకు నిధుల లభ్యత తగ్గుతోందనడానికి తాజా పరిణామం నిదర్శనమని ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ సీఈవో రాజేష్‌ సలూజా తెలిపారు. పలు స్టార్టప్‌ల వ్యాపార విధానాలు పటిష్టమైనవిగా లేకపోవడం వేల్యుయేషన్ల తగ్గుదలకు దారితీసిందని, అయితే సరైన కంపెనీలకు మాత్రం పెట్టుబడులు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

బైజూస్‌ వంటి కొన్ని స్టార్టప్‌లలో సమస్యలు నెలకొన్నప్పటికీ భారతీయ స్టార్టప్‌ వ్యవస్థకు ఫండింగ్‌పై ప్రతికూల ప్రభావాలేమీ ఉండబోవని సలూజా చెప్పారు.భారత్‌లో అంకుర సంస్థల వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, వచ్చే అయిదేళ్లలో దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 200కు చేరగలదని అంచనా వేస్తున్నట్లు హురున్‌ ఇండియా చీఫ్‌ రీసెర్చర్‌ అనాస్‌ రెహ్మాన్‌ జునైద్‌ చెప్పారు. చైనాలో 1,000కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని.. భారత్‌ ఆర్థికంగా ఎదగాలంటే స్టార్టప్‌లు చాలా కీలకమన్నారు.  

అంకుర సంస్థలను యూనికార్న్‌లు (ఒక బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌), గెజెల్స్‌ (500 మిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ కలిగి ఉండి, మూడేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశం ఉన్నవి), చీతాలు (250 మిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్, అయిదేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశం ఉన్నవి)గా వర్గీకరించారు. 

 250 మిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌ ఉన్న మొత్తం అంకుర సంస్థల సంఖ్య గతేడాది 122గా ఉండగా 2023లో 147కి చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top