
ఫోక్స్‌వ్యాగన్ తన టిగువాన్ ఆర్ లైన్‌ను దేశీయ మార్కెట్లో రూ. 49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లాంచ్ చేసింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన తర్వాత భారతదేశానికి వచ్చిన కొత్త తరం టిగువాన్ ఈ ఆర్-లైన్. ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికీ దిగుమతి అవుతుంది.
అప్డేటెడ్ డిజైన్, సరికొత్త ఫీచర్స్ కలిగిన ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్.. పెర్సిమోన్ రెడ్, నైట్ షేడ్ బ్లూ, గ్రెనడిల్లా బ్లాక్, ఒనిక్స్ వైట్ మదర్ ఆఫ్ పెర్ల్, సిప్రెస్సినో గ్రీన్, ఓయిస్టర్ సిల్వర్ అనే ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది క్లోజ్డ్ గ్రిల్, ముందు బంపర్ మీద ఎయిర్ డ్యామ్, షార్ప్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ వంటివి పొందుతుంది.
ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ 2.0-లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 201 Bhp పవర్, 320 Nm టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్‌తో లభిస్తుంది. ఇది 12.58 కిమీ/లీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. వాస్తవ ప్రపంచంలో మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.