5 ఏళ్లు.. 50 బిలియన్‌ డాలర్లు!

National Medical Devices Policy 2023: Medical sector grow to 50 billion Dollers in next 5 years - Sakshi

వైద్య పరికరాల రంగానికి ప్రత్యేక విధానం

నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

దేశీయంగా తయారీకి మరింత ఊతం

న్యూఢిల్లీ: వైద్య రంగంలో ఉపయోగించే పరికరాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే తయారీకి ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీ 2023కి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. వైద్య పరికరాల రంగం  వచ్చే అయిదేళ్లలో 50 బిలియన్‌ డాలర్ల స్థాయికి (దాదాపు రూ. 4.1 లక్షల కోట్లు) చేరేందుకు ఇది తోడ్పడనుంది.

భారత్‌లో వైద్య పరికరాలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతుండటంతో వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్‌ సమావేశం అనంతరం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మీడియాకు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దిగుమతులు కూడా ఉంటాయని, అయితే సాధ్యమైనంత మేరకు స్థానిక అవసరాలకు అనుగుణంగా దేశీయంగానే ఉత్పత్తిని పెంచుకోవడమే కొత్త విధానం లక్ష్యమని వివరించారు.  

ఆరు వ్యూహాలు..: నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ పాలసీలో ఆరు వ్యూహాలను నిర్దేశించుకున్నారు. నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధన.. అభివృద్ధి.. ఆవిష్కరణలకు తోడ్పాటు అందించడం, పరిశ్రమలోకి పెట్టుబడులను ఆకర్షించడం, మానవ వనరుల అభివృద్ధి, మన పరిశ్రమకు బ్రాండింగ్‌ సాధించడం .. అవగాహన కల్పించడం వంటివి ఈ వ్యూహాల్లో ఉన్నాయి.

ఇటు భారత్, అటు ప్రపంచ హెల్త్‌కేర్‌ అవసరాలను తీర్చే దిశగా దేశీయంగా వైద్య పరికరాల రంగం స్వయం సమృద్ధి సాధించేలా, ఒడుదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటూ పటిష్టమైన పరిశ్రమగా ఎదిగేలా అవసరమైన మద్దతు కల్పించి, దిశా నిర్దేశం చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడనుంది. ప్రధానంగా పేషంట్లను దృష్టిలో ఉంచుకుని, వారి అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను తయారు చేస్తూ వైద్య పరికరాల రంగం వేగవంతంగా వృద్ధి చెందేలా ఊతమివ్వాలని ఇందులో నిర్దేశించుకున్నారు.

11 బిలియన్‌ డాలర్ల పరిశ్రమ..
దేశీయంగా వైద్య పరికరాల మార్కెట్‌ 2020లో 11 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 90,000 కోట్లు) స్థాయిలో ఉందని అంచనా. అంతర్జాతీయంగా మెడికల్‌ డివైజ్‌ల మార్కెట్లో మన వాటా దాదాపు 1.5% వైద్య పరికరాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం ఇప్పటికే ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని అమలు చేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 4 మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ల ఏర్పాటు కోసం తోడ్పాటు అందిస్తోంది.

ఈ స్కీము కింద ఇప్పటివరకు రూ. 1,206 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో 26 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. 37 ఉత్పత్తులను తయారు చేసే 14 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు వివరించింది. వీటిలో లీనియర్‌ యాక్సిలరేటర్, ఎంఆర్‌ఐ స్కాన్, సీటీ–స్కాన్, మామోగ్రామ్, సీ–ఆర్మ్, ఎంఆర్‌ఐ కాయిల్స్, అధునాతన ఎక్స్‌–రే ట్యూబ్స్‌ మొదలైనవి ఉత్పత్తి చేస్తున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top