భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.
ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.

వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!
ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్‌కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.
జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.

నిర్ణయాలపై నమ్మకం
ప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.
సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.
కొత్త ప్రయత్నాలు అవసరం
అలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.
ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!


