
ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 లక్షల కోట్ల మొండి రుణాలను (వసూలు కాని/ఎన్‌పీఏలు) మాఫీ (రద్దు) చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా రాజ్యసభకు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.91,260 కోట్లను మాఫీ చేసినట్టు చెప్పారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.
అత్యధికంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2021–22లో రూ.1.16 లక్షల కోట్లు, 2022–23లో రూ.1.27 లక్షల కోట్ల చొప్పున మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇలా మాఫీ చేసిన మొత్తం నుంచి గత ఐదు సంవత్సరాల్లో వసూలైన మొత్తం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మాఫీ రుణాల్లో వసూలైంది 28 శాతమే.
ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎన్‌పీఏలకు బ్యాంక్‌లు ప్రొవిజన్లు చేయాల్సి ఉంటుంది. ఇలా నూరు శాతం కేటాయింపుల తర్వాత నిబంధనల కింద పుస్తకాల్లో మాఫీ చేసినట్టు చూపిస్తాయి. అయినా, వాటి వసూలుకు బ్యాంకులు చర్యలు చేపడుతూనే ఉంటాయి. మాఫీ చేసినప్పటికీ రుణ గ్రహీతలపై చెల్లింపుల బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.