డిజిటైజేషన్‌లో భారత్‌ భేష్‌

Microsoft Chairman Hails India Digitisation Journey Cloud Adoption - Sakshi

ఆర్థిక వృద్ధికి క్లౌడ్, ఏఐ ఊతం 

మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల వెల్లడి 

ముంబై: డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్‌ అసాధారణ రీతిలో కృషి చేస్తోందని టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌ సత్య నాదెళ్ల ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి సాధనలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) గణనీయంగా తోడ్పాటునివ్వగలవని ఆయన తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ ఫ్యూచర్‌ రెడీ లీడర్‌షిప్‌ సమిట్‌లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు.

2025 నాటికి చాలా మటుకు అప్లికేషన్లు ..క్లౌడ్‌ ఆధారిత మౌలిక సదుపాయాలతో రూపొందుతాయని, సుమారు 90 శాతం డిజిటల్‌ పని అంతా క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌పైనే జరుగుతుందని ఆయన చెప్పారు. ‘ఈ నేపథ్యంలోనే మేము ప్రపంచవ్యాప్తంగా 60 పైగా రీజియన్లు, 200 పైగా డేటా సెంటర్లపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. భారత్‌లో మరింతగా విస్తరిస్తున్నాం. హైదరాబాద్‌లో మా నాలుగో రీజియన్‌ ఏర్పాటు చేస్తున్నాం.

క్లౌడ్‌ను అంతటా అందుబాటులోకి తేవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని నాదెళ్ల చెప్పారు. భారత్‌లో క్లౌడ్‌ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. క్లయింట్‌ సర్వర్‌ శకంతో పోలిస్తే ప్రస్తుతం అంతా మారిపోయిందని .. అన్ని వ్యాపారాల్లోనూ క్లౌడ్‌ వినియోగం పెరుగుతోందని నాదెళ్ల వివరించారు. 2020 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల .. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. కస్టమర్లు, స్టార్టప్‌లు, డెవలపర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు మొదలైన వారితో సమావేశం కానున్నారు.  

కృత్రిమ మేధ హవా.. 
ఆటోమేషన్‌ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ చాలా కీలకంగా మారగలదని నాదెళ్ల చెప్పారు. ‘ముందుగా మనకు భారీ డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉండాలి. అది లేకుండా ఏఐ ప్రయోజనాలను పొందలేము. అందుకే మేము మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాం‘ అని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండటం, మార్కెట్‌ శక్తులు దానికి తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తుండటం వంటి అంశాలు భారత్‌కు సానుకూలమైనవని నాదెళ్ల అభిప్రాయపడ్డారు.

రీసెర్చ్‌ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం దేశీయంగా పబ్లిక్‌ క్లౌడ్‌ సర్వీసుల మార్కెట్‌ 2026 నాటికి 13 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. 2021–26 మధ్య కాలంలో ఏటా 23.1 శాతం వృద్ధి నమోదు చేయనుంది. భారత్‌లోని టాప్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీసు ప్రొవైడర్లలో అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌ క్లౌడ్, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top