భారత్ కోసం కొత్త కంపెనీ; చెరో 50% వాటా
ఫిజికల్ ఇంటెలిజెన్స్‌లో అగ్రగామి అనలాగ్
అబుదాబి కేంద్రంగా ఇప్పటికేకార్యకలాపాలు
వచ్చే రెండుమూడేళ్లలో రూ.4,500 కోట్ల వరకూ పెట్టుబడి: కృష్ణారెడ్డి
కొత్త సంస్థ పేరు, లోగో వివరాలు త్వరలో: అలెక్స్ కిప్‌మాన్
సాక్షి, బిజినెస్ ప్రతినిధి; ఇన్‌ఫ్రా రంగ దిగ్గజం ‘మేఘ ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్)’ ‘ఏఐ’లోకి ఎంట్రీ ఇచ్చింది. అబుదాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అనలాగ్ ఏఐ’తో కలిసి కొత్త భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసింది. ఈ జేవీలో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంటుందని మేఘ సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారమిక్కడ అనలాగ్ సీఈఓ అలెక్స్ కిప్‌మాన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు మూడేళ్లలో తాము ఈ జేవీలో రూ.3,000 కోట్ల నుంచి 4,500 కోట్ల వరకూ పెట్టుబడి పెడతామని, అనలాగ్ భారత కార్యకలాపాలను పూర్తిగా ఈ జేవీయే చూస్తుందని చెప్పారాయన. కొత్త కంపెనీ పేరు, లోగో తదితర వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అలెక్స్ కిప్‌మాన్ చెప్పారు.
ఫిజికల్ ఏఐ... అవకాశాలు అపారం
మూడేళ్ల కిందట అబుదాబి టెక్నాలజీ దిగ్గజం జీ24తో కలిసి అలెక్స్ కిప్‌మాన్ అనలాగ్ ఏఐని ఆరంభించారు. ఇది ప్రశ్నలకు టెక్ట్స్ రూపంలో సమాధానాలు చెప్పే ఫౌండేషనల్ ఏఐ కాదు. ఫిజికల్ ఏఐ. యంత్రాలు, పవర్ ప్రాజెక్టులు, వాహనాలు సహా భౌతిక వస్తువుల్ని సెన్సర్లతో అనుసంధానించి వాటి డిజిటల్ ట్విన్స్‌ను తయారు చేస్తుంది. వాటి సాయంతో దూరంగా ఉండికూడా వీటిని పర్యవేక్షించొచ్చు. యంత్రాల సామర్థ్యం పెరగటంతో పాటు ప్రమాదాల నివారణ, మెయింటెనెన్స్ అవసరాల్ని ముందే తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీల్లో వాటర్ ఫ్లోను, ట్రాఫిక్‌ను సైతం దీనిద్వారా సమర్థంగా నిర్వహించవచ్చు.
ఇలా చాలా ప్రయోజనాలుండటం వల్ల భారత్‌లో దీనికి అపార అవకాశాలున్నాయని కృష్ణారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘ఇది అత్యాధునిక టెక్నాలజీ. రిఫైనరీలతో సహా అన్నిచోట్లా వినియోగించొచ్చు. మా గ్రూపు సంస్థ ఒలెక్ట్రా త్వరలో బ్యాటరీ తయారీ, ప్యాసింజర్ కార్ల తయారీలోకి ప్రవేశిస్తోంది. దానిక్కూడా అనలాగ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ పనికొస్తుంది’ అని స్పష్టంచేశారు. ఈ జేవీ భారతదేశమంతటా సేవలందిస్తుందని, ఒక్క ఎంఈఐఎల్‌కే కాదని, ఇప్పటికే తమకు చాలామంది క్లయింట్లున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా కిప్‌మాన్ చెప్పారు. అబుదాబిలో చాలాచోట్ల దీన్ని వాడుతున్నారని, డేటా సెంటర్లు, పవర్ ప్రాజెక్టుల్లోనూ మోహరించామని చెప్పారాయన.
హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్
తమ భాగస్వామ్య సంస్థ సారథ్యంలో హైదరాబాద్‌లో ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని కిప్‌మాన్ చెప్పారు. ఉద్యోగుల సంఖ్య మొదట్లో తక్కువే ఉంటుందని, మెల్లగా విస్తరిస్తూ వెళతామని తెలియజేశారు. వచ్చే 3 నెలల్లో తమ భారత సేవలు వాణిజ్యపరంగా మొదలవుతాయని, పైలట్ ప్రాజెక్టులు ఇప్పటికే కొనసాగుతున్నాయని చెప్పారాయన. కార్యక్రమంలో మేఘ సంస్థ డైరెక్టర్లు పి.వి.ప్రణవ్ రెడ్డి, మానస్ రెడ్డి, అనలాగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యెన్సీ స్మిత్ పాల్గొన్నారు.


