
సీఎస్ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సహకారంతో అభివృద్ధి
ఆహార ప్రియులకు ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన ఫాస్ట్ ఫుడ్‌ను అందించాలనే లక్ష్యంతో మెక్‌డొనాల్డ్ ఇండియా (వెస్ట్ & సౌత్) ‘ప్రోటీన్ ప్లస్ స్లైస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ వెజిటేరియన్ ఆధారిత ఆవిష్కరణ కోసం మెక్‌డొనాల్డ్ సీఎస్ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)తో జత కట్టినట్లు పేర్కొంది.
ప్రోటీన్ ప్లస్ స్లైస్
ప్రోటీన్ ప్లస్ స్లైస్ అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్ స్లైస్. ఇది అధిక పోషకాలు కలిగి మాంసాహార ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతీయ అభిరుచులు, ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్లైస్ 100% శాఖాహారంతో తయారు చేసినట్లు చెప్పింది. ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ అధికంగా ఉంటుంది. భారతీయ ఆహార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానికంగా అభివృద్ధి చేశారు.
సీఎస్ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐ సహకారం
ఈ స్లైస్ ఆవిష్కరణకు మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్ఐఆర్-సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత విశ్వసనీయతను చేకూరుస్తుందని కంపెనీ నమ్ముతుంది. పప్పులు, తృణధాన్యాల నుంచి సేకరించిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఉపయోగించి పోషకాల సమతుల్యానికి సీఎఫ్‌టీఆర్‌ఐ పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయని మెక్‌డొనాల్డ్ తెలిపింది. స్థిరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి భారత్‌లో డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. ఈ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఇండియన్స్‌ను వద్దంటే యూఎస్‌కే నష్టం
వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ నిర్వహిస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్) మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అవుట్‌లెట్ల మెనూలో ఈ ప్రోటీన్ ప్లస్ స్లైస్‌ను ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాంక్ తీసుకొని, దాన్ని విశ్లేషించిన తర్వాత ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని కంపెనీ తెలిపింది.