నియంత్రణ సంస్థలు పక్కాగా ఉన్నాయి

Markets Very Well Regulated: Nirmala Sitharaman On Adani Stock Crash - Sakshi

చక్కని నిర్వహణతో కొనసాగుతాయి

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్‌ అదానీ గ్రూప్‌ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్‌ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు.

ముందున్నట్టే భారత్‌ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్‌ మార్కెట్‌గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు.  

మెరుగ్గా బ్యాంకింగ్‌ వ్యవస్థ  
భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్‌ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్‌పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కేబినెట్‌ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top