
న్యూఢిల్లీ: బుల్ మళ్లీ రంకెలేస్తుండటంతో మార్కెట్ కళకళలాడుతోంది. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 3.6 శాతం జంప్ చేయడంతో దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువలు కూడా భారీగా ఎగబాకాయి. మార్కెట్ క్యాప్ పరంగా అత్యంత విలువైన 10 కంపెనీల్లో 9 దిగ్గజాలు రూ.3.35 లక్షల కోట్లను జత చేసుకున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూకుడుతో మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లు ఎగసి, రూ. 19.71 లక్షల కోట్లకు చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.46,303 కోట్లు, టీసీఎస్ రూ.43,688 కోట్లు, ఇన్ఫోసిస్ రూ.34,281 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.34,029 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.32,730 కోట్లు, ఐటీసీ రూ.15,142 కోట్లు, ఎస్‌బీఐ రూ.11,111 కోట్లు, హెచ్‌యూఎల్ రూ.11,054 కోట్లు చొప్పున మార్కెట్ విలువను పెంచుకున్నాయి.
అయితే, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ మాత్రం రూ.19,330 కోట్లు తగ్గింది. అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. తర్వాత ర్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.14.80 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ.12.89 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.10.36 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్ (రూ. 10.34 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ.7.06 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.6.6 లక్షల కోట్లు), బజాజ్ ఫైనాన్స్ (రూ.5.69 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్ (రూ.5.59 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.5.45 లక్షల కోట్లు) ఉన్నాయి.