
ప్రపంచ కుబేరులు అపర దానకర్ణులుగా మారుతున్నారు. తమ సంపదను దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ మాతృసంస్థ టెక్ దిగ్గజం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రకారం.. మెటా సీఈవో తన సంపదలో 90 శాతానికి పైగా దానధర్మాలకు ఇచ్చేస్తున్నారు.
సుదీర్ఘకాలంగా పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న బిల్ గేట్స్ ఫార్చ్యూన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలను పంచుకున్నారు. జుకర్‌బర్గ్ దాతృత్వ సంస్థ చాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ ను ఆయన తీవ్రమైన ఉద్దేశానికి సంకేతంగా పేర్కొన్నారు. జుకర్ బర్గ్ దాతృత్వ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, "అతను చాలా మంచి ప్రారంభానికి వెళ్తున్నాడు" అని బిల్ గేట్స్ అన్నారు. తామిద్దరం తరచుగా దాతృత్వానికి సంబంధించిన అంశాలను మాట్లాడుకుంటామన్నారు.

మార్క్ జుకర్‌బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ తమ జీవితకాలంలో 99 శాతం ఫేస్‌బుక్ షేర్లను విరాళంగా ఇస్తామని హామీ 2015లోనే ప్రకటించారు.
అప్పటి నుంచి వారి ఫౌండేషన్ విద్య, వైద్యం, సైన్స్ రంగాల్లో ప్రాజెక్టులపై పనిచేస్తోంది.దాతృత్వ దృశ్యం ఎలా మారుతోందో గేట్స్ ఎత్తిచూపారు. వారెన్ బఫెట్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలిసి తాను 2010లో ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ క్యాంపెయిన్ ద్వారా తమ సంపదలో అధిక భాగాన్ని దాతృత్వానికి ఇచ్చేందుకు టెక్ పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.