ఇంటి నుంచీ పని చేయాల్సిందే

Many IT firms in Hyderabad keen on return to office by mid-2021 - Sakshi

వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ నూరు శాతం అసాధ్యం 

హైసియా సర్వేలో కంపెనీల అభిప్రాయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  కోవిడ్‌–19 పుణ్యమాని ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. కంపెనీనిబట్టి 20 శాతం లోపు మాత్రమే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేసే అంశంపై హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అసోసియేషన్‌ (హైసియా) తాజాగా ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ నూరు శాతం అసాధ్యం అని తేలింది. అంటే కీలక విభాగాల ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. ఇతరులు మాత్రం ఇంటిలోనే పని చేసేందుకు వీలు కల్పిస్తారు. కంపెనీల వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ ప్రణాళికలు కోవిడ్‌–19 వ్యాక్సినేషన్, వీటి ఫలితాలపై మాత్రమే ఆధారపడి ఉంటుం దని స్పష్టమైంది. గడిచిన తొమ్మిది నెలల కాలంలో 20 శాతం పెద్ద కంపెనీలు కొంత ఆఫీస్‌ స్థలాన్ని ఖాళీ చేశాయి.  

మెరుగ్గా పని చేస్తున్నారు..
ఉద్యోగుల్లో 50 శాతం వరకు హైదరాబాద్‌ వెలుపల వారివారి స్వస్థలాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు చెందినవారు కావడంతో ఆఫీస్‌కు తిరిగి వచ్చి పని చేసే విషయం సంక్లిష్టంగా మారింది. వారు తిరిగి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వర్క్‌ ఫ్రం హోం విధానంలోనూ ఉత్పాదకత మెరుగ్గా ఉంది. మహమ్మారి ముందస్తు రోజులతో పోలిస్తే ఉత్పాదకత 90 శాతంపైగా ఉందని 63 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత 100 శాతం దాటింది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల్లో.. 500 లోపు ఉద్యోగులున్నవి 63 శాతం, 501–1000 సిబ్బంది ఉన్నవి 11 శాతం, 1,000కిపైగా ఎంప్లాయ్స్‌ ఉన్నవి 26 శాతమున్నాయి.  

క్రమంగా ఆఫీసుకు..
వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ 0.5 శాతం ఉందని 75 శాతంపైగా పెద్ద ఐటీ, ఐటీఈఎస్‌ సంస్థలు తెలిపాయి. 2021 మార్చి నాటికి 20 శాతంలోపు ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు 60 శాతం కంపెనీలు వెల్లడించాయి. జూన్‌ నాటికి దీనిని 40 శాతం వరకు చేయనున్నాయి. పెద్ద సంస్థలు డిసెంబర్‌ చివరి నాటికి 50–70 శాతం ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేయించాలని ఆలోచిస్తున్నాయి. నూరు శాతం వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ వీలవుతుందని ఏ కంపెనీ కూడా చెప్పకపోవడం గమనార్హం. అత్యవసర విభాగాలు, కీలక ఉద్యోగులను మాత్రమే ఆఫీస్‌ నుంచి పని చేయిస్తామని 75 శాతం పెద్ద కంపెనీలు తెలిపాయి. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీస్‌ నుంచి విధులు ఉండేలా కూడా ఏర్పాట్లు చేయనున్నాయి. క్లయింట్ల అత్యవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కొన్ని కంపెనీలు తెలిపాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top