
కొత్త ఆర్డర్ల రాకతో దేశీ సర్వీసుల రంగం ఏప్రిల్‌లో స్వల్పంగా మెరుగుపడింది. దీంతో సేవల రంగం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ గత నెలలో 58.7కి చేరింది. మార్చిలో ఇది 58.5గా నమోదైంది. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పరిభాషలో సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.
తాజా గణాంకాలు, దీర్ఘకాలిక సగటు అయిన 54.2 స్థాయికన్నా అధికంగానే ఉన్నట్లు హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఇండియా ఎకానమిస్ట్ ప్రాంజల్ భండారీ తెలిపారు. మార్చిలో కాస్త నెమ్మదించిన ఎగుమతి ఆర్డర్లు ఏప్రిల్‌లో తిరిగి పుంజుకున్నట్లు వివరించారు. ఆసియా, యూరప్,
మధ్యప్రాచ్యం, అమెరికావ్యాప్తంగా భారతీయ కంపెనీల సేవలకు డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..
సగటు విక్రయ ధరలను పెంచడం ద్వారా సర్వీసుల కంపెనీలు తమ అధిక వ్యయాల భారాన్ని క్లయింట్లకు బదలాయించినట్లు పీఎంఐ సర్వేలో వెల్లడైంది. వ్యయాలపరంగా ఒత్తిళ్లు తగ్గి, రేట్లను పెంచడంతో మార్జిన్లు మెరుగుపడ్డాయి. కార్యకలాపాలు పుంజుకోవడంపై సర్వీస్ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నప్పటికీ అంచనాలు మాత్రం తగ్గాయి.