
భారత జీడీపీ 2025లో 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్ రేటింగ్స్ తాజా అంచనాలు ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ గతంలో వెల్లడించిన అంచనాలను తగ్గించింది. అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలతో వృద్ధి నిదానించొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు.. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు సైతం జీడీపీ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ విస్తరణ చేపట్టాలి, ముడి పదార్థాల సమీకరణ తదితరాల వ్యయాలు పెరిగిపోవ్చని పేర్కొంది. 2026 సంవత్సరానికి మాత్రం లోగడ ప్రకటించిన 6.5 శాతం వృద్ధి రేటు అంచనాలనే మూడీస్ కొనసాగించింది. 2024 కేలండర్ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండడం గమనార్హం. విధానపరమైన అస్పష్టత, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ది రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు మూడీస్ రేటింగ్స్ తెలిపింది.
ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం..
టారిఫ్‌లకు అమెరికా స్వల్పకాలం పాటు విరామం ఇచి్చనప్పటికీ చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు జీ–20 దేశాల వ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. 2025లో అమెరికా, చైనా జీడీపీ అంచనాలను సైతం కుదించింది. అమెరికా జీడీపీ 2025లో 1 శాతం, 2026లో 1.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గత అంచనాలు కుదించింది. చైనా 2025లో 3.8 శాతం, 2026లో 3.9 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
మొత్తం మీద అమెరికాకు సంబంధించి టారిఫ్‌లు గరిష్ట స్థాయికి చేరాయని.. రానున్న రోజుల్లో ఇవి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. తరచుగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) కఠినతరం చేస్తాయని, ఇది నిధులపై వ్యయాలు గణనీయంగా పెరిగేందుకు దారితీస్తుందని మూడీస్ తెలిపింది. వృద్ధికి ఇది విఘాతం కలిగించొచ్చని పేర్కొంది.