ధర తగ్గిస్తే ఇల్లు కొంటాం

Majority of homebuyers want discounts, flexi payment plans - Sakshi

సులభ వాయిదాలూ ఉండాలి 

హౌజింగ్‌.కామ్, నరెడ్కో సర్వేలో వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇల్లు కొనాలంటే డిస్కౌంట్‌ ఇవ్వాల్సిందే. అలాగే సులభ వాయిదాలూ ఉండాల్సిందేనని 73 శాతం కస్టమర్లు చెబుతున్నారని హౌజింగ్‌.కామ్, నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 3,000 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2022 జనవరి–జూన్‌ రెసిడెన్షియల్‌ రియల్టీ కన్జూమర్‌ సెంటిమెంట్‌ ఔట్‌లుక్‌ ప్రకారం.. రియల్టీలో పెట్టుబడులకు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్, గోల్డ్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే ఇదే అత్యధికం.

2020 జూలై–డిసెంబర్‌ కాలానికి చేపట్టిన సర్వేలో ఇల్లు, స్థలంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినవారి సంఖ్య 35 శాతం మాత్రమే. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు 57 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. విశ్వసనీయత లేమి కారణంగా కాబోయే కొనుగోలుదార్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఫ్లాట్‌ను బుక్‌ చేయడానికి ఇప్పటికీ జాగ్రత్తగానే ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నరెడ్కో చెబుతోంది. డెవలపర్లు తమ నిబద్ధతతో కూడిన గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారిస్తుండటంతో పరిస్థితి మారవచ్చని వివరించింది.  

ధరలు పెరుగుతాయ్‌..: ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్నందున వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు అధికం అవుతాయని 51 శాతం మంది వినియోగదార్లు భావిస్తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సాంకేతికత వినియోగంలో వేగం ఊపందుకుంది. ఆన్‌లైన్‌లో ఇల్లు చూసి కొనడం లేదా ఒకసారి ఇంటిని పరిశీలించిన వెంటనే  ఒప్పందాన్ని పూర్తి చేయడానికి 40 శాతం మంది కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు.

ఎనిమిది ప్రధాన నగరాల్లోని గృహ కొనుగోలుదారులు విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోద స్థలాలకు సమీపంలో ఇంటిని కోరుకుంటున్నారు. అత్యధికులు తమ ఇళ్ల నుండి 1–1.5 కిలోమీటరు దూరంలో ఇటువంటి సౌకర్యాలు ఉండాలంటున్నారు. గృహ రుణాల వడ్డీపై రిబేట్‌ పెంపు, నిర్మాణ సామగ్రిపై గూడ్స్, సర్వీస్‌ ట్యాక్స్‌ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ లభ్యత విస్తరణ, స్టాంప్‌ డ్యూటీ కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని హౌజింగ్‌.కామ్, నరెడ్కో చెబుతున్నాయి.  

కోవిడ్‌ ముందస్తు స్థాయికి..: రానున్న 6 నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని 79% మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మహమ్మారి ఫస్ట్‌ వేవ్‌లో 41%తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుందని 21% మంది మాత్రమే సూచించారు. 63% మంది గృహ కొనుగోలుదారులు రాబోయే 6 నెలలకు తమ ఆదాయంపై నమ్మకంతో ఉన్నారు. డిమాండ్‌ తిరిగి పుంజుకోవడంతో 2021 లో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయిలను దాటతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని హౌజింగ్‌.కామ్‌ గ్రూప్‌ సీఈవో ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top