బ్యాంకింగ్‌ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..! | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్‌ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..!

Published Wed, Feb 7 2024 7:49 AM

Loan Growth For Indian Banks in Next Financial Year - Sakshi

న్యూఢిల్లీ: డిపాజిట్‌ వృద్ధి స్వల్పంగా ఉంటే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్‌ బ్యాంకుల రుణ వృద్ధి 12–14 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ‘‘భారత్‌ బ్యాంకుల్లో కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులు– రుణ వృద్ధి’ అన్న శీర్షికతో ఈ మేరకు ఒక నివేదిక వెలువడింది. ‘‘మేము రేట్‌ చేసే భారతీయ బ్యాంకుల విషయంలో డిపాజిట్‌ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. ఇది కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), రుణ పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ క్రెడిట్‌ అనలిస్ట్‌ నికితా ఆనంద్‌ నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు. 

ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ నిధుల సమీకరణవైపు దృష్టి సారించవచ్చని ఆయన పేర్కొంటూ.. ఇదే జరిగితే బ్యాంకింగ్‌  రుణ వ్యయాలు పెరిగి మార్జిన్‌లు, లాభదాయకత దెబ్బతింటాయని విశ్లేసించారు. నిధుల సమీకరణ వ్యయాల పెరుగుదల, వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశాలు 2025లో బ్యాంకింగ్‌పై ప్రతికూలతలు చూపవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడానికి కారణంగా ఉండవచ్చని నికితా ఆనంద్‌ వివరించారు.

వ్యక్తిగత రుణ విభాగం జూమ్‌..
ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ విశ్లేషణ ప్రకారం, బ్యాంకుల మొత్తం లోన్‌ బుక్‌లో అన్‌సెక్యూర్డ్‌ పర్సనల్‌ లోన్‌ల వాటా పెరుగుతూనే ఉంటుంది. కఠిన ద్రవ్య పరిస్థితుల్లో మార్జిన్లు భారీగా పడిపోకుండా బ్యాంకింగ్‌కు రక్షించే అంశాల్లో ఇది ఒకటి.  క్రెడిట్‌ కార్డుల వంటి కొన్ని విభాగాలకు సంబంధించి వ్యక్తిగత రుణ మంజూరీలు ఇకపై మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకులకు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీ) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ విభాగంలో పురోగతి ఆగలేదు.  అన్‌సెక్యూర్డ్‌ వ్యక్తిగత రుణ మంజూరీలు పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్‌ జాగరూకత పాటించడం ఆర్‌బీఐ ఇటీవలి ఆదేశాల లక్ష్యం. 

హై రిస్క్‌ వెయిటేజ్‌  అన్‌సెక్యూర్డ్‌ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్‌ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్‌ కార్డ్‌ రుణాలపై రిస్క్‌ వెయిటేజ్‌ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్‌బీఎఫ్‌సీలపై 125 శాతానికి పెరిగింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించబోవని ఆర్‌బీఐ స్పష్టం చేయడం  వ్యక్తిగత రుణ విభాగంలో కొనసాగుతున్న పురోగతికి కారణం.  

2023 సెపె్టంబర్‌ చివరి నాటికి పర్సనల్‌ లోన్‌ల విభాగంలో బ్యాంక్‌ క్రెడిట్‌ బకాయిలు రూ. 48,26,833 కోట్లు.  ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. కాగా, స్థిరమైన రుణ నాణ్యత,  మూలధనం బ్యాంకుల క్రెడిట్‌ ప్రొఫైల్‌లకు మద్దతు ఇచ్చే అంశాలుగా ఆనంద్‌ తెలిపారు. అనుకూలమైన ఈక్విటీ మార్కెట్లు, ఆపరేటింగ్‌ పరిస్థితులు 2024లో బ్యాంకులకు రుణ సమీకరణ అవకాశాలను పెంచే అంశాలని ఆయన తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement