LIC: వ్యాపార వైవిధ్యంపై ఎల్‌ఐసీ దృష్టి    

LIC intends to raise market share in non participating biz: Chairman - Sakshi

 టర్మ్‌ ఇన్సూరెన్స్‌లో వాటా పెంపు 

వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: జీవిత బీమా రంగంలోని దిగ్గజ సంస్థ ఎల్‌ఐసీ సెప్టెంబర్‌ 1వ తేదీకి 66 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, తన వ్యాపార వైవిధ్యంపై దృష్టి సారించింది. నాన్‌ పార్టిసిపేటింగ్‌ ఇన్సూరెన్స్‌ ఉత్పత్తుల విభాగంలో మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ వెల్లడించారు. జీవిత బీమా రంగంలో ఎల్‌ఐసీకి సుమారు 65 శాతం మార్కెట్‌ వాటా ఉన్న విషయం తెలిసిందే.

17 ఇండివిడ్యువల్‌ పార్టిసిపేటింగ్‌ బీమా ప్లాన్లు
17 ఇండివిడ్యువల్‌ (వ్యక్తుల విభాగంలో) నాన్‌పార్టిసిపేటింగ్‌ ఉత్పత్తులు, 11 గ్రూపు ప్లాన్లను ఎల్‌ఐసీ ఆఫర్‌ చేస్తోంది. నాన్‌ పార్టిసిపేటరీ ప్లాన్లలో బోనస్‌లు రావు. పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే పరిహారాన్నిచ్చే అచ్చమైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లను నాన్‌ పార్టిసిపేటరీ ప్లాన్లుగా చెబుతారు. తమ ఏజెంట్లు ఇక ముందూ ఉత్పత్తుల పంపిణీకి మూలస్తంభాలుగా కొనసాగుతారని కుమార్‌ తెలిపారు. ఇండివిడ్యువల్‌ బీమా ఉత్పత్తుల వ్యాపారంలో 95 శాతం ప్రీమియం తమకు ఏజెన్సీల ద్వారానే వస్తున్నట్టు చెప్పారు. ఎల్‌ఐసీకి దేశవ్యాప్తంగా 13.3 లక్షల ఏజెన్సీలు ఉండడం గమనార్హం. బ్యాంకు అష్యూరెన్స్‌ (బ్యాంకుల ద్వారా) రూపంలో తమకు వస్తున్న వ్యాపారం కేవలం 3 శాతంగానే ఉంటుందని కుమార్‌ తెలిపారు.

‘‘జీవితావసరాలకు బీమా కావాలన్న అవగాహన గరిష్ట స్థాయికి చేరింది. కస్టమర్ల మారుతున్న అవసరాలకు తగ్గట్టు కొత్త విభాగాల్లోకి ప్రవేవిస్తాం’’అని వెల్లడించారు. నాన్‌ పార్టిసిపేటరీ ప్లాన్లను మరిన్ని తీసుకురావడం ద్వారా తాము అనుసరించే దూకుడైన వైవిధ్య విధానం తగిన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్‌ అష్యూరెన్స్‌ను మరింత చురుగ్గా మారుస్తామన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top