Lic: ఇదే మొదటి సారి.. అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్‌ఐసీ!

Lic Debutant Stands At Top 100 In Fortune 500 List - Sakshi

Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తొలిసారిగా ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్‌ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 93.98 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్‌ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్‌ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది.

2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్‌ మ్యాగజైన్‌ ఈ జాబితా రూపొందించింది. భారత్‌ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్‌ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్‌ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్‌ఐసీ మాత్రమే. ఫార్చూన్‌ 500లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్‌జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్‌బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్‌ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్‌ 370, టాటా స్టీల్‌ 435, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ 437 ర్యాంకుల్లో నిల్చాయి. 

(ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్‌, ఐటీ జోరు)

మరిన్ని విశేషాలు.. 
► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్‌ గ్రిడ్, చైనా నేషనల్‌ పెట్రోలియం, సైనోపెక్‌ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. 
► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్‌ డాలర్లకు చేరాయి.  
► తొలిసారిగా గ్రేటర్‌ చైనా (తైవాన్‌తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్‌ కంపెనీలను మించాయి.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top