breaking news
Govt sector organization
-
అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!
Lic Stands Fortune 500 List: ఇటీవలే లిస్టయిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తొలిసారిగా ఫార్చూన్ గ్లోబల్ 500 జాబితాలో చోటు దక్కించుకుంది. 97.26 బిలియన్ డాలర్ల ఆదాయం, 553.8 మిలియన్ డాలర్ల లాభంతో 98వ స్థానంలో నిల్చింది. అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ 93.98 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.15 బిలియన్ డాలర్ల లాభాలతో ఏకంగా 51 స్థానాలు ఎగబాకి 104వ ర్యాంకును దక్కించుకుంది. రిలయన్స్ గత 19 ఏళ్లుగా ఈ లిస్టులో కొనసాగుతోంది. 2022 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న సంస్థలతో ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితా రూపొందించింది. భారత్ నుంచి తొమ్మిది కంపెనీలు (అయిదు ప్రభుత్వ రంగంలోనివి, నాలుగు ప్రైవేట్ రంగంలోనివి) చోటు దక్కించుకున్నాయి. దేశీ కార్పొరేట్లలో రిలయన్స్ కన్నా పైస్థాయిలో ఉన్నది ఎల్ఐసీ మాత్రమే. ఫార్చూన్ 500లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 28 స్థానాలు ఎగబాకి 142వ ర్యాంకు, ఓఎన్జీసీ 16 ర్యాంకులు దాటి 190వ స్థానంలో ఉన్నాయి. ఎస్బీఐ 17 స్థానాలు (236వ ర్యాంకునకు), బీపీసీఎల్ 19 ర్యాంకులు (295వ స్థానానికి) పెరిగాయి. టాటా మోటార్స్ 370, టాటా స్టీల్ 435, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 437 ర్యాంకుల్లో నిల్చాయి. (ఇది కూడా చదవండి: ఏడో రోజూ లాభాల రింగింగ్, ఐటీ జోరు) మరిన్ని విశేషాలు.. ► వరుసగా తొమ్మిదోసారి అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ నంబర్ వన్ స్థానంలో నిల్చింది. అమెజాన్, చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం, సైనోపెక్ వరుసగా ఆ తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి. ► జాబితాలోని కంపెనీల మొత్తం అమ్మకాలు 19 శాతం పెరిగి 37.8 ట్రిలియన్ డాలర్లకు చేరాయి. ► తొలిసారిగా గ్రేటర్ చైనా (తైవాన్‌తో కలిపి) సంస్థల ఆదాయాలు.. అమెరికన్ కంపెనీలను మించాయి. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: మహిళల్లో మార్పులు.. వచ్చింది కాదు నచ్చింది కావాలి! -
ఓరియంటల్ బ్యాంక్ లాభం 16% అప్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ (క్యూ2) కాలానికి రూ. 291 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 251 కోట్లతో పోలిస్తే ఇది 16% వృద్ధి. వడ్డీయేతర ఆదాయంతోపాటు, రికవరీలు పెరగడం ప్రధానంగా లాభాల్లో వృద్ధికి దోహదపడినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ భూపిందర్ నయ్యర్ చెప్పారు. అయితే స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.77% నుంచి 4.74%కు ఎగశాయి. ఇక నికర ఎన్పీఏలు సైతం 2.69% నుంచి 3.29%కు పెరగడంతో బీఎస్ఈలో షేరు 4.3% పతనమై రూ. 267 వద్ద ముగిసింది. కాగా, రుణాల నాణ్యత సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలనూ చేపట్టినట్లు నయ్యర్ చెప్పారు. ఈ కాలంలో వడ్డీయేతర ఆదాయం 26% జంప్‌చేసి రూ. 393 కోట్లకు చేరింది. గతంలో రూ. 312 కోట్లుగా ఉంది. ఇక రికవరీలు సైతం రూ. 314 కోట్ల నుంచి రూ. 339 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం దాదాపు 7% పుంజుకుని రూ. 5,328 కోట్లను అధిగమించింది. గతంలో రూ. 4,988 కోట్ల ఆదాయం నమోదైంది. తాజా బకాయిలు ప్రస్తుత సమీక్షా కాలంలో ఎన్పీఏలలో భాగమైన తాజా బకాయిలు(స్లిప్పేజెస్) రూ. 978 కోట్లకు చేరాయి. గతంలో ఇవి రూ. 1,041 కోట్లుగా నమోదయ్యాయి. కేటాయింపులు, కంటింజెన్సీలు రూ. 550 కోట్ల నుంచి రూ. 641 కోట్లకు ఎగశాయి. కాగా, నిర్వహణ లాభం రూ. 825 కోట్ల నుంచి నామమాత్ర వృద్ధితో రూ. 855 కోట్లను తాకింది. ఇక 2.6% నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) సాధించగా, కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 10.88%గా నమోదైంది.