ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. ప్చ్‌! 

Lic Debut Is Second-Worst Among 11 Companies That Listed This Year - Sakshi

రూ. 82 నష్టంతో రూ. 867 వద్ద షురూ 

ఇంట్రాడేలో రూ. 860 వరకూ డౌన్‌

ఇష్యూ ధర రూ. 949 – ముగింపు 875 

ముంబై: స్టాక్‌ మార్కెట్లు దూకుడు చూపినప్పటికీ బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ లిస్టింగ్‌లో ఇన్వెస్టర్లకు నిరాశనే మిగిల్చింది. ఇష్యూ ధర రూ. 949కాగా.. బీఎస్‌ఈలో 9 శాతం(రూ. 82) నష్టంతో రూ. 867 వద్ద లిస్టయ్యింది. ఎన్‌ఎస్‌ఈలోనూ రూ. 77 తక్కువగా రూ. 872 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. పాలసీదారులతోపాటు, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఐపీవో ధరలో డిస్కౌంట్‌ ఇవ్వడంతో రూ. 889, రూ. 904 చొప్పున షేర్లు లభించాయి. ఈ ధరలతో పోల్చినా ఎల్‌ఐసీ నీరసంగానే లిస్టయ్యింది. కాగా.. బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు తొలుత రూ. 920 వద్ద గరిష్టాన్ని తాకగా, తదుపరి రూ. 860 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ ఇంట్రాడేలో రూ. 919–860 మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. చివరికి బీఎస్‌ఈలో రూ. 875.5 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ. 873 వద్ద ముగిసింది. వెరసి రోజంతా ఇష్యూ ధర కంటే దిగువనే కదిలింది. ఎన్‌ఎస్‌ఈలో 4.87 కోట్లు, బీఎస్‌ఈలో 27.52 లక్షలు చొప్పున షేర్లు చేతులు మారాయి. ఎల్‌ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది.  

టాప్‌–5లో చోటు 
స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌ ద్వారా ఎల్‌ఐసీ రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)ను పొందింది. దీంతో మార్కెట్‌ విలువలో టాప్‌–5 ర్యాంకులో చోటు సాధించింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం రూ. 17.12 లక్షల కోట్లతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), రూ. 12.67 లక్షల కోట్లతో టీసీఎస్, రూ. 7.29 లక్షల కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తొలి మూడు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. తదుపరి ఇన్ఫోసిస్‌ రూ. 6.38 లక్షల కోట్లతో నాలుగో స్థానాన్ని పొందగా.. రూ. 50,000 కోట్లు కోల్పోయిన ఎల్‌ఐసీ ఐదో ర్యాంకులో నిలిచింది. వెరసి మార్కెట్‌ విలువలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌(రూ. 5.27 లక్షల కోట్లు), ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసీఐసీఐ(రూ. 4.94 లక్షల కోట్లు), పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ(రూ. 4.17 లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ(రూ. 3.97 లక్షల కోట్లు)లను ఎల్‌ఐసీ వెనక్కి నెట్టింది. 

కొత్త ప్రొడక్టులు 
జనవరి–మార్చిలో నాన్‌పార్టిసిపేటింగ్, గ్యారంటీ ప్రొడక్టులను ప్రవేశపెట్టిన ఎల్‌ఐసీ ఇకపై వీటిని మరింత అధికంగా విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు కుమార్‌ చెప్పారు. కొన్ని కొత్త ప్రొడక్టులను సైతం విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ప్రత్యేకంగా డిజిటల్‌ మార్కెటింగ్‌ చానల్‌ను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. పాలసీల పంపిణీ కోసం బ్యాంకెస్యూరెన్స్‌ చానల్‌పై సైతం దృష్టిపెట్టనున్నట్లు వివరించారు. ఎల్‌ఐసీ 63 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉన్నట్లు తెలియజేశారు.  

కొనుగోలు చేయండి... 
అనిశ్చిత మార్కెట్‌ పరిస్థితుల కారణంగానే ఎల్‌ఐసీ బలహీనంగా లిస్టయినట్లు దీపమ్‌ సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. మార్కెట్లను ఎవరూ అంచనా వేయలేరని, తగిన విలువ కోసం దీర్ఘకాలం వేచిచూడవలసిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు. డిస్కౌంట్‌ ద్వారా పాలసీదారులకు, ఇన్వెస్టర్లకు కొంత రక్షణ కల్పించినట్లు తెలియజేశారు. కాగా.. మార్కెట్లు కోలుకుంటే షేరు ధర పుంజుకుంటుందని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. ఐపీవోలో షేర్లు దక్కని ఇన్వెస్టర్లు సెకండరీ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంపాటు షేరు తక్కువ స్థాయిలో నిలిచేందుకు ఎలాంటి కారణమూ కనిపించడంలేదన్నారు. మార్కెట్‌ విశ్లేషకులు సైతం దీర్ఘకాలానికి ఎల్‌ఐసీ షేర్లను హోల్డ్‌ చేయవచ్చని సూచిస్తున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top