కొత్త బిజినెస్‌లోకి దిగిన ఎల్‌జీ.. విద్యార్థులే టార్గెట్‌!

LG India launches self laundry service business - Sakshi

టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు వంటి ఎలక్ట్రానిక్‌ గృహోపకరణాలు తయారు చేసే ఎల్‌జీ కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వివిధ ఎలక్ట్రానిక్‌ అప్లయన్సెస్‌ తయారు చేసే ఈ దక్షిణ కొరియా కంపెనీ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి దిగింది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ( LG Electronics India ) విద్యారంగాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో స్వీయ-లాండ్రీ సేవా వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇక్కడ వాణిజ్య వాషింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాదికల్లా 200 సెల్ఫ్ లాండ్రీ సర్వీస్ సెంటర్‌లను ప్రారంభించే ప్రణాళికలతో కంపెనీ ఈ వ్యాపారంలో 4 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.33 కోట్లు ) పెట్టుబడి పెడుతోంది.

ఈ మేరకు గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయంతో ఎల్‌జీ జత కట్టంది. అక్కడున్న 1500 మంది విద్యార్థులకు మొదటి సారిగా లాండ్రీ సేవలు ప్రారంభించింది. మెషిన్ రిజర్వేషన్, ఆపరేషన్, ఆటోమేటెడ్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఓ యాప్‌ను కూడా రూపొందించింది. ఈ యాప్‌ ద్వారా విద్యార్థులు ఎల్‌జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్‌లను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్ మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో సెల్ఫ్ లాండ్రీ సర్వీస్‌తో విద్యార్థులకు సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. "ఈ వ్యాపారంలో 4 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాం. 2024 చివరి నాటికి 200 సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ సెంటర్లను తెరవడానికి ప్లాన్ చేస్తున్నాం" అని జియోన్ పేర్కొన్నారు.

whatsapp channel

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top