దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. షార్క్-2 5జీ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర కేవలం 11,999 రూపాయలు. 5జీ ఫోన్లలోకెల్లా అత్యంత చౌకది కావడం ఒక విశేషం. అలాగనీ ఇందులో ఫీచర్లకు, హంగు, ఆర్బాటాలకేమీ కొదవలేదు. అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం దీని బ్యాటరీ గురించి.
6000ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఈ ఫోన్‌తో ఏకంగా 13 గంటల 35 నిమిషాలపాటు యూట్యూబ్ వీడియోలు చూసుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. ఆన్ స్క్రీన్ టైమ్ కూడా దాదాపు 12 గంటల 23 నిమిషాలు. అంటే రోజులో సగం సమయం బ్రౌజింగ్, ఛాటింగ్, రీల్స్ వంటివి ఎన్ని చూసినా బ్యాటరీ మాత్రం ఖతమైపోదన్నమాట.
స్క్రీన్ విషయానికి వస్తే.. 120 హెర్ట్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డీ-ఎల్‌సీడీ డిస్‌ప్లే లభిస్తుంది. రిఫ్రెష్ రేట్ అధికంగా ఉండటం వల్ల యానిమేషన్లు, గేమింగ్ వంటివి చాలా సాఫీగా నడుస్తాయి. స్క్రీన్ సైజు దాదాపు 6.75 అంగుళాలు. ఐపీ64 రేటింగ్ కాబట్టి ఫోన్ లోపలికి దుమ్మూ, ధూళి చొరబడే అవకాశాలు దాదాపు లేవు. అలాగే ఏ పక్క నుంచి నీళ్లు చిమ్మినా లోనికి ప్రవేశించవు. గాలి వానలనూ తట్టుకుని పనిచేయగలదు. సోనార్ గోల్డ్, ఆర్యా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఆక్టా కోర్ ప్రాసెసర్
లావా షార్క్-2 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆరు నానోమీటర్ల యూనీసాక్ టీ8200 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు జీబీల ర్యామ్‌కు అదనంగా 4 జీబీల వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఫిజికల్ మెమరీ విషయానికి వస్తే 64 గిగాబైట్లు లభిస్తుంది. శక్తిమంతమైన ఈ ప్రాసెసర్, మెమరీల కాంబినేషన్ కారణంగా రోజువారీ మల్టీటాస్కింగ్ చాలా సులువు అవుతుంది. ఆన్‌టూటూ 11 బెంచ్ మార్కు స్కోరు కూడా 500000కుపైగా ఉండటం గమనార్హం.
ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. క్లీన్ ఆండ్రాయిడ్ 16తో నడుస్తుంది ఈ స్మార్ట్‌ఫోన్. సాధారణ బడ్జెట్ ఫోన్లలో మాదిరిగా దీంట్లో బ్లోట్‌వేర్ అంటే అవసరమైన అప్లికేషన్లు, యడ్‌వేర్‌లూ లేకపోవడం ఇంకో ప్లస్ పాయింట్. పైగా రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ఉచితంగా అందుతూంటాయి. ఫలితంగా ల్యాగ్స్, హ్యాంగ్స్ తక్కువగా ఉంటాయని అంచనా. లావా షార్క్-2 5జీ ఫోన్ ఏఐ ఆధారిత 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సెల్ఫీ కెమెరా రెజల్యూషన్ 5 మెగాపిక్సెల్స్. దేశంలోని దాదాపు అన్ని 5జీ నెట్‌వర్క్‌లతో పనిచేయగలదు కాబట్టి కనెక్టివిటీ సమస్యలు దాదాపుగా ఉండవు. కస్టమర్ సపోర్టు కోసం ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది ఈ కంపెనీ.
స్టోరేజీ కష్టాలకు అవకాశం!
షార్క్-2 5జీ బడ్జెట్‌ఫోన్ అయినప్పటికీ జెన్‌జీ స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని దృష్టిలో పెట్టుకుంటే మెమరీ కష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంది. 64 జీబీ స్టోరేజీ కొన్ని రోజుల్లోనే భర్తీ అయిపోతుందంటున్నారు కొంతమంది యువత. ఆప్లికేషన్ లైబ్రరీలు, మీడియా కలెక‌్షన్లు బోలెడు స్టోర్ చేసుకుంటాం కాబట్టి స్టోరేజీ సరిపోదని చెబుతున్నారు.
వర్చువల్ ర్యామ్‌తో కలిపి మొత్తం 8 జీబీలు ఉన్నా.. మల్టీ టాస్కింగ్ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదురుకావచ్చునని వీరు చెబుతున్నారు. ఇంత తక్కువ బడ్జెట్‌లో 4కే రెజల్యూషన్ రికార్డింగ్ లభించడం బాగున్నా లైటింగ్ సక్రమంగా లేనప్పుడు కెమెరాతో సమస్యలున్నట్టు జెన్‌జీ చెబుతోంది.
రూ.15 వేలు లోపు 5జీ ఫోన్లు
| ఫోన్ | ధర | స్క్రీన్ (అంగుళాలు) | బ్యాటరీ (mAh) | ఛార్జింగ్ (Watts) | కెమెరా (MP) |
|---|---|---|---|---|---|
| రెడ్‌మీ నోట్ 14 SE | ₹13,999 | 6.67" AMOLED, 120Hz | 5110 | 33W | 50 + 2 |
| మోటో G57 పవర్ | ₹13,999 | 6.72" FHD+ LCD, 120Hz | 7000 | 45W | 50 + 8 |
| సామ్‌సంగ్ గెలాక్సీ M17 | ₹14,999 | 6.7" AMOLED (Dimensity 6300) | 5000 | — | 50 + 5 + 2 |
| iQOO (మోడల్ వివరాలు లేవు) | ₹14,500 | 6.7" LCD, 120Hz | 6000 | — | 50 |
| CMF నథింగ్ ఫోన్ 1 | ₹14,665 | 6.7" FHD+ (Dimensity 7300) | 5000 | — | 50 + 2 |


