ఆఫీసే ‘మేల్‌’.. వర్క్‌ఫ్రం హోం వద్దంటోంది వీళ్లే! జీతమే ముఖ్యం

Job Seekers Opinion On Work From Home - Sakshi

న్యూఢిల్లీ: ఓవైపు వర్క్‌ఫ్రం హోం విధానానికి ముగింపు పలికేందుకు బడా కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా... మరోవైపు వర్క్‌ఫ్రం హోంకే మెజారిటీ ఉద్యోగార్థులు మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఓ సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. కరోనా నేపథ్యంలో దేశంలో ఉద్యోగ అవకాశాలు, పని విధానంపై ఇండీడ్‌ ఇండియా హైరింగ్‌ ట్రాకర్‌ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. తొమ్మిది నగరాల్లోని 1,200 కంపెనీలతోపాటు 1,500 మంది ఉద్యోగుల నుంచి ఈ సర్వే కోసం శాంపిల్స్‌ సేకరించారు. 

వర్క్‌ఫ్రం హోం బెటర్‌
కరోనా కేసులు తగ్గినా.. దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. ఆఫీసుకు వెళ్లి పని చేసేయడానికి ఫ్రెషర్లు విముఖత చూపిస్తున్నారు. ఇంటి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. విధానంపై ఇండీడ్‌ ఇండియా హైరింగ్‌ ట్రాకర్‌ సర్వేలో ఇంటి నుంచి పనికి 46 శాతం మంది మద్దతు తెలపగా హైబ్రిడ్‌ విధానం ఉండాలని 29 శాతం మంది అన్నారు. 

హైబ్రిడ్‌ అంటున్న కంపెనీలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీసు, ఇంటి నుంచి పని చేసే హైబ్రిడ్‌ విధానం మేలని 42 శాతం కంపెనీలు తెలిపాయి. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే వీలు ఉంటుందని ఆ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. కాగా ఇంటి నుంచి విధులు ఉండాలని 35 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేయడమే సరైన పద్దతని 23 శాతం కంపెనీలు చెప్పాయి. 

ఆఫీసే... మేల్‌ 
వర్క్‌ఫ్రం హోం విధానానికి మేల్‌ ఎంప్లాయిస్‌ నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. అయితే ఇదే సమయంలో మహిళలు వర్క్‌ఫ్రం హోంకే జై కొడుతున్నారు. ఇండీడ్‌ ఇండియా హైరింగ్‌ ట్రాకర్‌ సర్వేలో ఇంటి నుంచి పని కొనసాగించడమే బాగుంది 51 శాతం మహిళలు తెలియజేస్తే.. పురుషుల విషయంలో ఇది 29 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. సాధారణంగా బయటకు వెళ్లి పని చేయడాన్ని ఇష్టపడే మగవాళ్లు, వర్క్‌ఫ్రం హోంలో ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటాన్ని ఇష్టపడటం లేదు. 

వేతనమే ముఖ్యం
వర్క్‌ఫ్రం హోం , ఆఫీస్‌ అనే తేడాలు పెద్దగా పట్టించుకోమని కంపెనీ ఎంత వేతనం అందిస్తుంది అనేదే తమకు ప్రాధాన్యమని  25 శాతం మంది ఉద్యోగార్థులు స్పష్టం చేశారు. 

నియమకాలు పెరిగాయ్‌
దేశవ్యాప్తంగా ఏప్రిల్‌–జూన్‌ కాలంలో నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే 11 శాతం పెరిగాయి. ఐటీ 61 శాతం, ఆర్థిక సేవలు 48, బీపీవో, ఐటీఈఎస్‌ రంగాలు 47 శాతం వృద్ధి కనబరిచాయి. అయితే గడిచిన త్రైమాసికంలో పదోన్నతి, వేతన పెంపు అందుకోలేదని 70 శాతం మంది ఉద్యోగులు వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top