
ప్రమోటర్ల నుంచి సమీకరణ
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్ నుంచి రూ. 15,825 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించనున్నట్లు కంపెనీ వివరించింది. ప్రస్తుతం అంబానీ కుటుంబంతో పాటు వివిధ గ్రూప్ హోల్డింగ్ సంస్థలకు కంపెనీలో 47.12 శాతం వాటాలు ఉన్నాయి. ప్రిఫరెషన్షియల్ ఇష్యూ ద్వారా 54.19 శాతానికి పెరుగుతుంది.
ఒక్కొక్కటి రూ. 316.50 రేటు చొప్పున 50 కోట్ల వరకు వారంట్లను కంపెనీ జారీ చేయనుంది. వీటి ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. ఇష్యూ అనంతరం ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ వాటా 1.08 శాతం నుంచి 4.65 శాతానికి, జామ్‌నగర్ యుటిలిటీస్ అండ్ పవర్ వాటా 2.02 శాతం నుంచి 5.52 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధానంగా ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది.