భారత్, జపాన్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, సాంప్రదాయ పుష్ప అలంకరణ కళ ‘ఇకేబానా’ (Ikebana) ప్రచారంలో సేవలు అందించిన హైదరాబాద్‌కు చెందిన ఇకేబానా నిపుణురాలు నిర్మలా అగర్వాల్ జపాన్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నారు. భారత్-జపాన్ సాంస్కృతిక సంబంధాల అభివృద్ధికి గాను ఆమెకు ‘కాన్సుల్ జనరల్స్ కమెండేషన్ అవార్డు’ను జపాన్ కాన్సులేట్ జనరల్ అధికారికంగా ప్రకటించి ప్రధానం చేసింది.
దేశవ్యాప్తంగా ప్రదర్శనలు
శతాబ్దాల నాటి జపనీస్ పుష్పాలంకరణ విద్య అయిన ‘ఇకేబానా’ కేవలం పువ్వుల అమరిక మాత్రమే కాదు.. అది ప్రకృతి, మానవ జీవితాల సమతుల్యతకు, శాంతికి నిదర్శనం. నిర్మలా అగర్వాల్ కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్‌తో పాటు దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు, శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ ఈ వినూత్న కళను భారతీయ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు.
‘జపాన్ కాన్సులేట్ నుంచి ఈ అరుదైన పురస్కారం అందుకోవడం గర్వకారణంగా ఉంది. నా ఇకేబానా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతీ పువ్వు పుట్టుక నుంచి కొత్త విషయం నేర్చుకోవచ్చు. ప్రకృతి మాటలను ప్రేమగా వినడం నాకు ఈ జపనీస్ కళే నేర్పించింది. ఈ అవార్డు నా సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రేరణగా నిలుస్తుంది’ అని నిర్మలా అగర్వాల్ అన్నారు.
ఇరు దేశాల బంధానికి వంతెన
రెండు భిన్న సంస్కృతులను అనుసంధానించడంలో ఇటువంటి కళాత్మక మార్పిడులు కీలక పాత్ర పోషిస్తాయని దౌత్యవేత్తలు కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో, రెండు దేశాల పౌరుల మధ్య అవగాహనను పెంచడంలో నిర్మలా అగర్వాల్ కృషి ప్రశంసనీయమని కాన్సులేట్ పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ వేదికలపై స్థానిక కళాకారులు సాధిస్తున్న ఈ రకమైన గుర్తింపు నగరం సాంస్కృతిక వైవిధ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. నిర్మలా అగర్వాల్‌కు లభించిన ఈ గౌరవం పట్ల పలువురు దౌత్యవేత్తలు, కళాభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: పండగ ఆఫర్లు.. ఆన్‌లైన్ షాపింగ్.. బీ అలర్ట్!


