జెట్‌ ఎయిర్‌వేస్‌లోకి రూ. 1,375 కోట్లు!

Jalan Kalrock To Infuse 1375 Crore Rupees In Jet Airways - Sakshi

న్యూఢిల్లీ: దివాలా తీసిన ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను వేలంలో దక్కించుకున్న జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం .. రుణ పరిష్కార ప్రణాళిక ప్రకారం కంపెనీలో రూ. 1,375 కోట్ల మేర నిధులు సమకూర్చనుంది. ఇందులో రూ. 475 కోట్లు రుణదాతలకు దక్కనున్నాయి. మిగతా రూ. 900 కోట్ల మొత్తాన్ని సంస్థ నిర్వహణ మూలనిధి అవసరాలు, పెట్టుబడి వ్యయాల కోసం కన్సార్షియం వెచ్చించనుంది. ఈ ప్రణాళిక ప్రకారం బ్యాంకులకు దక్కే నిధుల్లో భారీగా అంటకత్తెర పడనుంది. సుమారు రూ. 7,800 కోట్ల పైగా రావాలంటూ బ్యాంకులు క్లెయిమ్‌ చేయగా వాటికి రూ. 475 కోట్ల మేరకే కేటాయింపు జరిగింది.

ఇందులోనూ మళ్లీ కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియకు (సీఐఆర్‌పీ) సంబంధించిన ఖర్చులు పోగా ఆర్థిక రుణదాతలకు నికరంగా రూ. 380 కోట్లు లభించనున్నాయి. దీనిలో రూ. 185 కోట్ల మొత్తాన్ని ముందస్తుగా చెల్లించనుండగా, మిగతా రూ. 195 కోట్లకు జీరో – కూపన్‌ బాండ్లను కన్సార్షియం జారీ చేస్తుంది. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌లో బ్యాంకులకు 9.5 శాతం, జెట్‌ ప్రివిలేజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 7.5 శాతం వాటా లభిస్తుంది.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ 2019 ఏప్రిల్‌లో కార్యకలాపాలు నిలిపివేసింది. అదే ఏడాది జూన్‌ నుంచి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్‌ 22న జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం సమర్పించిన రుణ పరిష్కార ప్రణాళికకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలను రాతపూర్వకంగా బుధవారం ప్రకటించింది.
చదవండి: జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ రెక్కలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top