
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (ఐవోబీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 30% జంప్‌చేసి రూ. 1,050 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 808 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం రూ. 9,106 కోట్ల నుంచి రూ. 9,215 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా రూ. 6,629 కోట్ల నుంచి రూ. 7,634 కోట్లకు బలపడింది. ఈ ఏడాది సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.
తద్వారా బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 94.61 శాతం నుంచి 90 శాతానికి దిగిరానున్నట్లు పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు
(ఎన్‌పీఏలు) 3.1 శాతం నుంచి 2.14 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.57 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గాయి. ఐవోబీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.6% లాభంతో రూ.38 వద్ద క్లోజైంది.