ఇన్సూరెన్స్‌ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం

Insurance Industry Expected To Net Gross Direct Premium Income About Rs 3 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్‌ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.

ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్‌ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top