డేంజర్‌ బేల్స్‌.. మౌలిక రంగ వృద్ధిలో క్షీణత..

Infrastructure Growth Rate Declined In 2022 March - Sakshi

మౌలిక రంగం వృద్ధి 4.3 శాతం

మార్చి గణాంకాల విడుదల

2021–22లో 10.4 శాతం పురోగతి    

న్యూఢిల్లీ: ఎనిమిది రంగాల మౌలిక పరిశ్రమల గ్రూప్‌, మార్చిలో 4.3 శాతం పురోగతి సాధించింది. ఫిబ్రవరిలో నమోదయిన 6 శాతంకన్నా తాజా సమీక్షా నెలల్లో వృద్ధి వేగం తగ్గింది. ఇక  2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ వృద్ధి రేటు 10.4 శాతంగా ఉంది. అయితే దీనికి లో బేస్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2020–21 గణాంకాలను పరిశీలిస్తే.. మౌలిక రంగంలో అసలు వృద్ధిలేక పోగా 6.4 శాతం క్షీణించింది.  

గణాంకాలు ఇలా... 
అధికారిక గణాంకాల ప్రకారం, సమీక్షా కాలంలో బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌ 0.1 శాతం, 3.4 శాతం చొప్పున క్షీణించాయి. అయితే సహజవాయువు (7.6 శాతం), స్టీల్‌ (3.7 శాతం), సిమెంట్‌ (8.8 శాతం), విద్యుత్‌ (4.9 శాతం) రంగాలు కొంత పర్వాలేదనిపించింది. అయితే 2021 మార్చితో ఈ రేట్లు హై బేస్‌తో వరుసగా 12.3 శాతం, 31.5 శాతం, 40.6 శాతం, 22.5 శాతాలుగా ఉన్నాయి. ఇక సమీక్షా నెల మార్చితో రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎరువుల రంగం వృద్ధి రేట్లు వరుసగా 6.2 శాతం, 15.3 శాతాలుగా ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా దాదాపు 40.27 శాతం. ఐఐపీ మార్చి గణాంకాలు వచ్చే రెండు వారాల్లో విడుదలవుతాయి.    
 

చదవండి: బ్రిటన్‌ కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను! అదే నిజమైతే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top