IndiGo: ఇండిగో ఓవర్‌ యాక్షన్‌: డీజీసీఏ స్ట్రాంగ్‌ రియాక్షన్‌

IndiGo Fined Rs 5 Lakh For Not Allowing Boy With Special Needs On Board - Sakshi

న్యూఢిల్లీ: విమానంలో ఎక్కకుండా నిరాకరించి దివ్యాంగ బాలుడిని ఘోరంగా అవమానించిన విమానయాన సంస్థ ఇండిగోకు షాక్‌ తగిలింది. ఈ ఘటనపై  విచారణ చేపట్టిన టాప్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పౌన విమానయాన నిబంధనలను ఉల్లంఘించారని  సిబ్బందిపై మండిపడింది. ఈ క్రమంలో ఇండిగోకు 5 లక్షల రూపాయల  జరిమానా విధించింది. 

ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఇండిగో గ్రౌండ్ స్టాఫ్ అమర్యాదగా ప్రవర్తించారని విచారణలో తేలిందని డీజీసీఏ తాజాగా ప్రకటించింది.  అలాగే మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా సంస్థ నిబంధనలను పునఃపరిశీలించాలని  కూడా ఆదేశించింది. 

ఇటీవల (మే 7న) చోటు చేసుకున్న ఈ ఘటనపై విమాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దర్యాప్తు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వయంగా తానే పర్యవేక్షిస్తానని కూడా  ప్రకటించిన సంగతి  తెలిసిందే.

కాగా దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక కుటుంబం పట్ల ఇండిగో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు. ఆ చిన్నారి వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది అంటూ వారిని అడ్డుకున్నారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు వాదించినా ఫలితం లేక పోయింది.  దీంతో వారంతా తమ ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. 

అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మనీషా గుప్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.  ఈ నేపథ్యంలో ఇండిగో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top