చూపు కోసం ఏఐ టెక్నాలజీ.. ఇండియన్‌ టెక్‌ నిపుణుల కొత్త ఆవిష్కరణ!

Indian Young Entrepreneurs Invented AI Based Glasses for Vision impaired persons - Sakshi

అంధులు, దృష్టి లోపం ఉన్న వారి కోసం ఇద్దరు యంగ్‌ ఇండియన్‌ ఎంట్రప్యూనర్లు రూపొందించిన సరికొత్త కళ్ల జోడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ను అత్యంత సమర్థంగా ఉపయోగిస్తూ రూపొందించిన కళ్ల జోడు  రాబోయే రోజుల్లో ఎంతో మంది కష్టాలను తీర్చనున్నాయి.

చెన్నైకి చెందిన కార్తీక్‌ మహదేవన్‌, కార్తీక్‌ కన్నన్‌లు స్థానికంగా ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. ఇంజనీరింగ్‌లో ఉన్నప్పటి నుంచే కంప్యూటర్‌ విజన్‌, డిజైనింగ్‌ టూల్స్‌పై ఇద్దరికీ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉండేది. మాస్టర్స్‌ డిగ్రీ కోసం కార్తీక్‌ మహదేవన్‌ నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో జాయిన్‌ అయ్యాడు. అక్కడున్నప్పుడు చూపు లేని వాళ్లు, దృష్టి లోపంతో బాధపడుతున్న వారి కష్టాలను స్వయంగా చూశాడు. దీంతో టెక్నాలజీ సాయంతో వీరి సమస్యకు ఏమైనా పరిష్కారం చూపవచ్చా అనే ఆలోచనలో పడిపోయాడు. వెంటనే తన మిత్రుడు కార్తీక్‌ కన్నన్‌ని సంప్రదించాడు.

ఇద్దరు మిత్రులు కలిసి నిర్విరామంగా పని చేశారు. చివరకు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో పని చేసే సరికొత్త కళ్ల జోడుని రూపొందించారు. అనంతరం ఎన్విజన్‌ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఏఐతో పని చేసే కళ్ల జోళ్లను మార్కెట్‌లోకి తెచ్చారు. అనతి కాలంలోనే నెదర్లాండ్స్‌తో పాటు యూరప్‌లో ఈ కళ్లజోడు బాగా పాపులర్‌ అయ్యింది. ఎప్పటి నుంచో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఇటీవల ఈ స్టార్టప్‌ గురించి ఫోర్బ్స్‌ పత్రిక సైతం కథనం ప్రచురించింది.

ఎన్విజన్‌ కళ్లజోడులో 8 మెగా పిక్సెల్‌ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ఎదురుగా వచ్చే దృశ్యాలను ఎప్పటికప్పుడు రికార్డ్‌ చేస్తుంది. మనకు ఏదైనా సమచారం కావాల్సి వచ్చినప్పుడు ఈ కళ్లజోడును చిన్నగా టచ్‌ చేస్తే చాలు ఎదురుగా ఉన్న వస్తువులు, విషయాలు, వార్తలు, అక్షరాలు అన్నింటిని నేరుగా వినిపిస్తుంది. దీని సాయంతో ఎవరి అవసరం లేకుండానే వంటలు చేయడం, నడవడం, ఫోన్లు చేయడం, అవసరాన్ని బట​​​​​​‍్టి వీడియో కాల్స్‌,  చదవడం వంటి పనులన్నీ చేయోచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మరో మనిషి తోడు లేకుండానే అంధులు, దృష్టి లోపాలు ఉన్న వారు తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు.

ఎన్విజన్‌లో అత్యధునిక ఫీచర్లు ఉన్నాయి. వైఫై, బ్లూటూత్‌ కనెక్టివిటీ, యూఎస్‌బీ సపోర్ట్‌, ఏఐ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే ఆరు గంటల పాటు  నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. ఈ కళ్లజోడు ధర 3,268 యూరోలు ( రూ.2.70 లక్షలు)గా ఉంది. 

చదవండి: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులకు బిగ్‌ షాక్‌.. గూగుల్‌ కీలక నిర్ణయం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top