ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!

Indian Steel Makers Rush To Fill Supply Gap By Russia-Ukraine War - Sakshi

రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దాడుల వల్ల కలిగిన సరఫరా అంతరాన్ని భర్తీ చేయడానికి భారతదేశంలోని ఉక్కు తయారీదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, ఎగుమతి పరంగా మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తాయి.

ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటం వల్ల ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్(జెఎస్‌పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం..  సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతం పెరగడంతో ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా ప్రాంతంలో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది" అని వి.ఆర్. శర్మ బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

రష్యా-ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్‌కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్‌మార్క్ ధర మార్కెట్‌లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది.. యూరప్‌లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ కంపెనీలు టన్నుకు 1150 డాలర్ల ధరతో యూరప్‌కు ఉక్కును సులభంగా పంపగలవని, ఇది యూరప్‌లో నడుస్తున్న ధర కంటే దాదాపు 100 డాలర్లు తక్కువ అని వి.ఆర్. శర్మ చెప్పారు. 

ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోందని ఆయన చెప్పారు. గత సంవత్సరం మన దేశ ఉక్కు & ఇనుప ఖనిజం ఎగుమతులలో దాదాపు మూడవ వంతు ఐరోపా దేశాలకు కంపెనీలు ఎగుమతి చేశాయి. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ & వియత్నాంలకు భారతదేశం 2021లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం వల్ల ఏర్పడిన సరఫరా కొరత వల్ల ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. 

(చదవండి: మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top