రూపాయి విలవిల..  | Indian rupee has fallen to historic lows against the US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి విలవిల.. 

Jan 24 2026 6:04 AM | Updated on Jan 24 2026 6:04 AM

Indian rupee has fallen to historic lows against the US dollar

కొత్త కనిష్టస్థాయికి పతనం 

ఇంట్రాడే ట్రేడింగ్‌లో 92 కిందికి 

చివరికి 32 పైసలు బలహీనపడి 91.90 వద్ద ముగింపు

ముంబై: డాలరు డామినేషన్‌కు రూపాయి విలవిల్లాడుతోంది. విలువ అంతకంతకూ కరిగిపోతోంది. తాజాగా శుక్రవారం డాలర్‌ మారకంలో 32 పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 91.90 వద్ద స్థిరపడింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగడం, అంతర్జాతీయ అనిశి్చతులు రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. 

అలాగే క్రూడాయిల్‌ ధరల ర్యాలీ, అమెరికా బాండ్లపై రాబడులు పెరగడమూ ఒత్తిడి పెంచాయని నిపుణులు తెలిపారు. ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 91.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 42 పైసలు క్షీణించి 92.00 వద్ద చరిత్రాత్మక ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. 

డాలర్‌ బలోపేతం, ఎఫ్‌ఐఐల విక్రయాల ప్రభావంతో గతేడాదిలో 5% క్షీణించి రూపాయి... 2026లో జనవరి 23 వరకు 2% (202 పైసలు) పతనమైంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో రిస్క్‌ సామర్థ్యం తగ్గడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల కొనసాగింపు ఒత్తిళ్ల ప్రభావంతో రూపాయి మరింత క్షీణించే వీలుంది. వచ్చే వారం నెలాఖరు కావడంతో దిగుమతిదారులు, హెడ్జర్ల నుంచి డాలర్ల్ల డిమాండ్‌ నెలకొనవచ్చు. రానున్న రోజుల్లో 91.60 – 92.30 శ్రేణిలో ట్రేడవ్వొచ్చు’’ అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు అనుజ్‌ చౌదరీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement