
ఇండియన్ రైల్వే ప్రయాణికుల లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైళ్లలో సామానుపై ఉన్న నిబంధనలు సడలింపుగా ఉండటంతో, ప్రయాణికులు అధిక బరువు, పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులతో ప్రయాణిస్తున్నారు. ఇది రైలు బోర్డింగ్ సమయంలో రద్దీ పెరగడానికి, ప్రయాణికుల అసౌకర్యానికి, భద్రతా సమస్యలకు దారితీస్తోంది.
ఈ నేపథ్యంలో, విమానాశ్రయాల్లో అమలవుతున్న తరహాలోనే, రైల్వే కొన్ని ప్రధాన స్టేషన్లలో సామానుపై పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్, కాన్పూర్, అలీగఢ్ జంక్షన్ స్టేషన్లలో తొలుత ఈ నిబంధలను అమలు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తమ సామానును ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా తూకం చేయించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు చార్జీలు విధిస్తారు. పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న బ్యాగులపై కూడా ప్రత్యేక ఫార్ములా ద్వారా చార్జీలు లెక్కించనున్నారు.
ఉచిత సామాను పరిమితి ప్రయాణ తరగతిని బట్టి మారుతుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే ‘ఎల్’ స్కేల్‌పై 1.5 రెట్లు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీ రూ.30, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. 5–12 ఏళ్ల పిల్లలకు ఉచిత లగేజీ పరిమితిలో సగం, గరిష్టంగా 50 కేజీల వరకూ అనుమతి ఉంటుంది. పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులు, బోర్డింగ్ స్పేస్‌ను ఆక్రమించేలా ఉంటే జరిమానా విధిస్తారు. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులకు ఉచిత పరిమితి వర్తించదు.
ప్రయాణ తరగతుల వారీగా ఉచిత సామాను పరిమితి
ప్రయాణ తరగతి | గరిష్ట పరిమితి | ఉచిత పరిమితి | అదనపు ఛార్జీతో అనుమతించేది |
---|---|---|---|
ఏసీ ఫస్ట్ క్లాస్ | 150 కిలోలు | 70 కిలోలు | 15 కిలోలు |
ఏసీ 2-టయర్ / ఫస్ట్ క్లాస్ | 100 కిలోలు | 50 కిలోలు | 10 కిలోలు |
ఏసీ 3-టయర్ / చైర్ కార్ | 40 కిలోలు | 40 కిలోలు | 10 కిలోలు |
స్లీపర్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ) | 80 కిలోలు | 40 కిలోలు | 10 కిలోలు |
సెకండ్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ) | 70 కిలోలు | 35 కిలోలు | 10 కిలోలు |
రైళ్లలో లగేజీ పరిమితికి సంబంధించి నిబంధనలు ఇదివరకే ఉన్నాయని, అయితే వాటి అమలు విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించేది కాదని అధికారులు చెబుతున్నారు. “లగేజీ నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. వాటి అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చాం” అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ తగ్గించటం, బోర్డింగ్ సౌలభ్యం పెంచటం, రైళ్లలో భద్రత మెరుగుపరచటం ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్‌మని బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వస్తోంది